Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా జూన్ మొదటి వారంలో వానాకాలం సాగు సమస్యలపై సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని, కౌలు రైతుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జూన్, జూలై మాసాల్లో తెలంగాణ రైతు సంఘం గ్రామ, మండల మహాసభలు నిర్వహిస్తామని, ఆగస్టులో జిల్లా మహాసభలు నిర్వహించాలని, అక్టోబర్‌లో రాష్ట్ర మహాసభలో జరుగుతాయని తెలిపారు. గురువారంనాడిక్కడి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాద్‌రావు మాట్లాడారు. మే 24న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర విస్తత సమావేశం నిర్ణయాలను వారు తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలనీ, నకిలి విత్తనాలను అరికట్టాలనీ, రుణాలు సకాలంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లక్ష రూపాయలలోపు రుణమాఫీ ఏక కాలంలో చేయాలని కోరారు. ధరణిలో వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భూసార పరీక్షలు నిర్వహించి దానికనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించాలని కోరారు.
అప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. విత్తన సబ్సిడీని కొనసాగించాలని, ఎరువుల కొరతను రాకుండా చూడాలని అన్నారు. పండ్లు, కూరగాయలు రేటు నిర్ణయించి కొనుగోలుకు గ్యారెంటీ చేయాలని చెప్పారు. పప్పు ధాన్యాలు, నూనె దినుసులు పండించేం దుకు రైతులను ప్రోత్సా హించాలని కోరారు.