Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ల సీనియార్టీ ఉండబోదన్న సర్కారు
- అంగీకారపత్రం ఇస్తేనే ట్రాన్స్ఫర్
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. వాటిపై పలు ఆంక్షలను విధిస్తున్నది. ఉపాధ్యాయుల సీనియార్టీ ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉపాధ్యాయుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. సున్నా సర్వీసుతో పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అంగీకార పత్రం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన జీవోనెంబర్ 21 ప్రకారమే పరస్పర బదిలీలుంటాయని స్పష్టం చేశారు. వాటికి అంగీకారమైతే ఉపాధ్యాయులు అంగీకారపత్రం రాసి సున్నా సర్వీసును అంగీకరించాలని కోరారు. కోర్టు తుది తీర్పునకు లోబడి ఈ బదిలీలుంటాయని స్పష్టం చేశారు. రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్టయితే పరస్పర బదిలీలు జరుగుతాయని తెలిపారు. గతంలో ఇందుకోసం 2,895 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరస్పర బదిలీ కోరుకుంటే సీనియారీ ఉంటుందంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోనెంబర్ 402పై కొందరు హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. అయితే ఈ ఆంక్షలకు అంగీకరించని ఉపాధ్యాయులు దరఖాస్తులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల సీనియార్టీ ఉండబోదనీ 21 జీవో, అది ఉంటుందంటూ 402 జీవోలను ప్రభుత్వం తెచ్చిందని తెలిపాయి. ఇప్పుడేమో ఉపాధ్యాయులకు సీనియార్టీ వర్తించబోదంటూ ప్రకటించడం సరైంది కాదని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్డినెన్స్ ద్వారా పరస్పర బదిలీలు జరపాలి : సీపీఎస్ యూనియన్
ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆర్డినెన్స్ ద్వారా ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు చేపట్టాలని సీపీఎస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు మ్యాన పవన్, రోషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయులు సర్వీసు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బదిలీల్లో ఎక్కువగా సీపీఎస్ ఉద్యోగులే ఉన్నారని వివరించారు. ఆర్డినెన్స్ ద్వారా ఉపాధ్యాయుల సర్వీసుకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అంగీకారపత్రం ద్వారా బదిలీలు జరిగితే భవిష్యత్తులో పదోన్నతుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అండర్‌టేకింగ్ ఇవ్వకపోతే పరస్పర బదిలీ అర్హత కోల్పోయినట్టు పరిగణించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పరస్పర బదిలీలపై ఉపాధ్యాయుల అంగీకార పత్రం ఇవ్వాలనే నిబంధనను నిలుపుదల చేయాలని టీయూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లచ్చిరాం, రఘునందన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పరస్పర బదిలీలకు సర్వీసు రక్షణతో అనుమతించి దరఖాస్తులు స్వీకరించి న ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు అంగీకార పత్రం ఇవ్వాలని చెప్పడం సరైంది కాదని తెలిపారు.