Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూఢవిస్వాలను కాదు.. టెక్నాలజీని నమ్ముతాం
- ఇదే ఉత్సాహంతో పనిచేస్తే తెలంగాణలో పక్కా బీజేపీదే అధికారం
- బేగంపేట స్వాగతసభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కుటుంబ పార్టీలు ఆటంకంగా మారాయనీ, కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ..పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారు పేరన్నారు. ఎండ, వేడిమి, చెమటలు కూడా తట్టుకుని తన కోసం వచ్చిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నిసార్లు వచ్చినా తెలంగాణకు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోందన్నారు. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ పార్టీల పాలనలో యువత, మేధావులకు సరైన రాజకీయ అవకాశాలు రావని చెప్పారు. కుటుంబ పాలన అవినీతికి కేంద్ర బిందువు అన్నారు. సామ,దాన,దండోపాయాలను ప్రయోగించి తెలంగాణలో కుటుంబ పార్టీ పాలన జరుగుతున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినా, మూఢవిశ్వాసాల ఆధారంగా తెలంగాణలో పాలన నడుస్తున్నదని సీఎం కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. 2013లో తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణలో ప్రచారానికి వెళ్లొద్దని కొందరు సూచించినా...ఇక్కడ ప్రచారానికొస్తే ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాతే తాను ప్రధాని అయ్యాయని గుర్తుచేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నోయిడా నుంచి పోటీచేస్తే అధికారంలోకి రారని ప్రచారం జరిగితే..అలాంటి మూఢ విశ్వాసాలను నమ్మకుండా ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొంది సీఎం అయ్యారని గుర్తు చేశారు. తాము మూఢవిశ్వాసాలను నమ్మమనీ, టెక్నాలజీని నమ్ముతామని చెప్పారు. టీఆర్ఎస్ పాలనపై పోరాడే క్రమంలో బలిదానం చేసుకున్న బీజేపీ శ్రేణులకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఎనిమిదేండ్లలో దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామనీ, దళిత, గిరిజనులు, పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచామనీ, నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నామనీ, ముద్రయోజన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. తెలంగాణలోనూ పలు పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు సహకరించడం లేదనీ, అయినా, ప్రజల నుంచి తమను ఎవ్వరూ దూరం చేయలేరని అన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్‌తో దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. స్టార్టప్‌లో మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. తెలంగాణ ఐటీ హబ్అనీ, దాని సామర్థ్యాన్ని దేశం చూస్తున్నదని తెలిపారు. తెలంగాణ భవిష్యత్, విముక్తి కోసం బీజేపీ పోరాటం చేస్తున్నదనీ, ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సర్దార్ వల్లాభారుపటేల్ అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమపార్టీ పక్కా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు అధ్యక్షత వహించిన ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, నేతలు ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.