Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలను పంపాలని రోడ్డెక్కిన రైతులు
- ఆర్మూర్‌లో రోడ్డుపై ధాన్యం సంచులు
నవతెలంగాణ-ఆర్మూర్ టౌన్/ఎల్లారెడ్డి(లింగంపేట్)
కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యం నెల రోజులుగా అలాగే ఉందని.. ఇప్పటి వరకు ఒక్క లారీ పంపలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిచి ముద్దవుతోందని ఆవేదనచెందారు. ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి రహదారిపై వడ్ల సంచులు వేసి రైతులు బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గోవింద్‌పేట్ సొసైటీ పరిధిలో తొమ్మిది వేల బస్తాలు కాంటా వేసి నెలరోజులుగా ఉన్నాయని, రైసుమిల్లుకు తరలించలేదని తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. రెండ్రోజుల్లో ధాన్యం బస్తాలు తరలించకుంటే జాతీయ రహదారిపై పెద్దఎత్తున ఆందోళన చేపడతామని, రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కాంటా వేశాక నెలల తరబడి ధాన్యం తరలించకపోవడంతో బస్తా బరువు మూడు నుంచి నాలుగు కిలోలు తగ్గిపోతోందని, దీనికి తోడు రైస్‌మిల్లర్లు ఐదు కిలోల కడ్తా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో క్వింటాకు 8-10 కిలోల ధాన్యం నష్టపోతున్నామని తెలిపారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేపట్టారు. తహసీల్దార్ వేణుగోపాల్‌గౌడ్ రైతుల వద్దకు వచ్చి.. సముదాయించారు. రెండు మూడ్రోజుల్లో మొత్తం ధాన్యం తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
ధాన్యం వద్దే పడిగాపులు కాస్తున్నాం..
సకాలంలో ధాన్యం కాంటా వేసి మిల్లులకు లారీల్లో తరలించకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోయారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్తండా రైతులు ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తెచ్చి నెల కావస్తున్నా ఇప్పటి వరకు మూడు లారీల ధాన్యం మాత్రమే తరలించారని, అకాల వర్షాలతో బస్తాలు తడిచి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే లారీలు లేవని సాకులు చెబుతున్నారని, ముందే ఏర్పాటు చేసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు రాస్తారోకో చేయడంతో.. తహసీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధాన్యం తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.