Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు అండగా నిలిచి పోరాడుతాం
- బెదిరింపులకు తలొగ్గేది లేదు: సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.భాస్కర్
- ప్రాణం పోయినా సరే భూమి ఇచ్చేది లేదు : బాధితురాలు భారతమ్మ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు పేద దళితుల భూములను అక్రమార్కులు దౌర్జన్యంగా లాక్కుంటుంటే అడ్డుకోవాల్సింది పోయి వారికి మద్దతుగా ఉంటూ దళితులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ హెచ్చరించారు. ఎన్నో ఏండ్లుగా తరతరాలుగా భూములు దున్నుకుని జీవనం సాగిస్తున్న దళితుల భూములపై అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు కన్నేసి లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులకు తమ భూమి దక్కేవరకు సీపీఐ(ఎం) వారికి అండగా ఉండి పోరాడుతుందన్నారు. శుక్రవారం భూ బాధితులు బాబు, భాస్కర్ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కె. భాస్కర్ మాట్లాడారు. దళితుల వెట్టిచాకిరీ ఫలితంగా నాటి జామీందార్లు వారికి భూములను అసైన్డ్ చేశారనీ, అప్పటినుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 46లో 24 ఎకరాలు, 61 సర్వే నెంబర్లో 32 ఎకరాలు దళితల చేతుల్లో ఉండేదన్నారు. ఈ భూములను క్రమక్రమంగా ప్రభుత్వం నాలాల కింద కొంత భూమి తీసుకుందని తెలిపారు. 1993లో పేదలకు ఇండ్ల స్థలాల పేరుతో మరో కొంత భూమి లాక్కుందన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేస్తే.. దళితులను అక్కడి నుంచి తొలగించవద్దని 1999లో ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. కానీ హైకోర్టు ఆర్డర్‌ను బేఖతారు చేస్తూ కొంత మంది రాజకీయ నాయకుల అండతో న్యాయవాది వృత్తిలో ఉన్న తులసీదాస్ అనే వ్యక్తి రీక్షాపుల్లర్స్ అసోసియేషన్ పేరుతో రీక్షాకార్మికులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ప్రభుత్వం నుంచి ఆర్డర్ తెచ్చుకొని పేదల భూములను అమ్ముకున్నాడని విమర్శించారు. 1993లో ఇండ్ల స్థలాల పేరుతో తెచ్చుకున్న అనుమతి పత్రాలు చూపుతూ.. మరో మారు పేద భూములును లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఆ భూ అక్రమార్కునికి ప్రభుత్వ రెవెన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పోలీసులు అండగా నిల్చి పేదల భూములను అప్పన్నంగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే బాలాపుర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలాపూర్ ప్రాంతంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే.. భూ అక్రమార్కులతో చేతులు కలిపి ఆ భూములను కాజేస్తున్న స్థానిక తహసీల్దార్‌పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలన్నారు. సివిల్ విషయంలో జోక్యం చేసుకుంటున్న పోలీసుల అధికారులపై ఉన్నతాధికారులు సీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలు భారతమ్మ మాట్లాడుతూ.. మా తాతల నాటి నుంచి ఈ భూములు దున్నుకుంటూ.. కూరగాయలు, వరి పండించుకుంటూ జీవనం సాగించామన్నారు. మా భూములపై కన్నేసిన రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల బలంతో భూ అక్రమార్కులు లాక్కుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. అడిగే వారు లేక.. ఇప్పటికే చాలా భూమి కాజేవారని, ప్రస్తుతమున్న 6 ఎకరాల భూమిలో కూడా రీక్షాపుల్లర్స్ అసోసియేషన్ పేరుతో తులసీదాస్ అనే లాయర్ మా భూములను లాకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా మా భూములను విడ్చిపెట్టేది లేదన్నారు. ఓట్ల కోసం వచ్చిన సబితమ్మ నన్ను గెలిపిస్తే .. మీ భూములకు పట్టాల్పిస్తానని చెప్పి.. ఇప్పుడు మా భూములు మాకు దక్కకుండా చేస్తోందన్నారు. స్థానిక తహసీల్దార్, పోలీసులు తులసీదాస్‌తో చేతులు కలిపి మా భూములను కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా భూముల మీదికి వస్తే ఎవరిని లెక్కచేసేది లేదని, మా నోటికాడి బుక్కను లాక్కుంటే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్, నాయకులు యాదయ్య, బాధితులు పోచయ్య, లక్ష్మమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.