Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంతో వ్యాపారం చేస్తున్న నలుగురు గుజరాతీ బేరగాళ్లు
- గంగలో శవాలు తేలడమే మోడీ గొప్పతనమా?
- 111జీవో రద్దు చేస్తాం.. ఐటీ సంస్థలు పెట్టండి
- మీడియా సమావేశంలో పీయూసీ చైర్మెన్ ఎ.జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫ్యామిలీ రాజకీయాల చరిత్ర బీజేపీదేనని, మోడీ మాటలు వింటే గురివింద సామెత గుర్తుకు వస్తున్నదని పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకూ బీజేపీలో కుటుంబ పెత్తనమే సాగుతున్నదని చెబుతూ.. అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, ధర్మేందర్ ప్రధాన్, వసుంధర రాజే, పంకజ్ సింగ్, లడ్డా బహుగుణ తదితర నాయకుల కుటుంబాల నేతల పేర్లను ప్రస్తావించారు. బాల్, బ్యాట్ పట్టుకోవడం చేతకాని అమిత్‌షా కొడుకు జరుషా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యా రని ప్రశ్నించారు. యూపీ, మహారాష్ట్ర, హర్యానా, ఏపీ, తదితర రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టు కోలేదా? అని నిలదీశారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం సాధించిన తెలంగాణ గాంధీ కేసీఆర్ అని కొనియాడారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు ఉద్యమకారులని చెప్పారు. అలాంటి వారు ప్రజల ఆశీస్సులతో పదవులు నిర్వహిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మోడీ ఒక యాక్టర్, స్టంట్ మాస్టర్ అని విమర్శించారు. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు తనకు ఎందుకు స్వాగతం పలకడం లేదనే విషయాన్ని మోడీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణను ఐటీ హబ్‌గా మారుస్తామంటే ఎవరొద్దన్నారు? అని ప్రశ్నించారు. అవసరమైతే 111 జీవో ను కూడా ఎత్తేస్తామనీ, ఆ భూముల్లో ఐటీ సంస్థలు పెట్టండి అని సవాల్ విసిరారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలేమయ్యా యనీ, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న16 లక్షల ఉద్యోగ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ జగడాల పార్టీ అనీ, మూఢ నమ్మ కాలకు ప్రతీక అని విమర్శించారు. అది కిల్లర్స్,సెల్లర్స్ పార్టీ అని ఆరోపించారు. నలుగురు గుజరాతీ బేరగాళ్లు ఇండి యాను వ్యాపార వస్తువుగా చేశారనీ, అందులో మోడీ, అమిత్‌షాలు అమ్మేటోళ్లయితే..అంబానీ, అదానీ కొనేటోళ్లు అయ్యారని విమర్శించారు. మేకిన్ ఇండియా ఫేక్ ఇండి యాగా, డ్రీమిండియా పూరిండియాగా, టీమిండియా బ్లేమిండియాగా మారడానికి కారణం మోడీనేనన్నారు. తెలంగాణ కోసం ఏ బీజేపీ నేత ప్రాణ త్యాగం చేశారో చెప్పా లని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మాట్లాడు తూ.. కుటుంబ రాజకీయాల గురించి మోడీ మాట్లాడటం సిగ్గు చేటనీ, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దావోస్‌లో కేటీఆర్ భారత్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత ను కత్తులతో నృత్యం చేయించడమే ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడమా? మోడీ అని ప్రశ్నించారు. కరోనా సమయం లో గంగా నది లో శవాలు తేలేలా చేయడం మోడీ గొప్పదనమా అని నిలదీశారు. ప్రజల్లో విద్వేషపు విష బీజాలు నాటుతోంది బీజేపీనేనని విమర్శించారు. విదేశాల నుంచి 10 శాతం బొగ్గు దిగుమతి చేసుకోవాలని పవర్ ప్లాంట్లకు ఆంక్షలు పెట్టడం ఆదానీ కోసమే కాదా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే బీజేపీ నేతలు, మోడీ వాటి ప్రారంభానికి ఎందుకు వచ్చారని అడిగారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ..మోడీ తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ లో ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారనీ, వారిని ప్రజలే వెలి వేస్తారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి ప్రధాని మోడీ అని విమర్శించారు. బీజేపీకి మతపర ఎజెండా తప్ప మరోటి లేదని విమర్శించారు. మూఢనమ్మకాలను ప్రచారం చేసే వ్యక్తి తాను టెక్నాలజీని నమ్ముతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశానికి సరిపడా కరెంటు, సాగునీరు అందించడానికి కేసీఆర్ దగ్గర స్పష్టమైన విజన్ ఉందనీ, అందుకే బీజేపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ పిచ్చి ప్రేలాపనలను జనం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదని తెలిపారు.