Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంతో పరుగులు తీసిన స్థానికులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ప్రేమ పెండ్లి చేసుకున్నారని ఇటీవల సరూర్‌నగర్‌లో, బేగంబజార్‌లో ఇద్దరు యువకులను కులదురహంకార హత్య చేసిన సంఘటనలు మరువకముందే ప్రేమ విషయంలో మరో ఘటన జరిగింది. తనను ప్రేమించట్లేదనే కోపంతో శుక్రవారం మధ్యాహ్నం పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువతిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు ఓ యువకుడు. ఈ ఘటన కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబానగర్‌లో యువకుడు హబీబ్, యువతి కుటుంబాలు ఒకే బస్తీలో నివాసముంటున్నాయి. గతంలో వీరిద్దరు స్నేహితులు. హబీబ్ ఆమెను వేధించడంతో 2021లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య మాటల్లేవు. అయితే, కొంత కాలంగా హబీబ్ తనను ప్రేమించాలని యువతిని వేధిస్తున్నాడు. యువతి తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒమర్ హోటల్ సమీపంలో యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా వెంబడించాడు. వెనుకనుంచి వచ్చి ఒక్కసారిగా యువతిని నెట్టేసి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మెడ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘట నాస్థలిలో క్లూస్ టీం వివరాలను సేకరించింది. కేసు నమోదు చేసు కున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబం ధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకావడంతో వైరల్‌గా మారింది. రోడ్డుపై అంత ఘోరం జరుగుతున్నా స్థానికులెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా భయంతో పరుగులు తీశారు.