Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్‌లో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ
- సర్టిఫికెట్ పొందాల్సిన బస్సుల సంఖ్య 13 వేలకు పైనే!
- ఇప్పటివరకు 3వేలకు పైగా బస్సులకు ఫిట్‌నెస్ పూర్తి
- జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సుల సామర్థ్య నిర్వహణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే, బడి బస్సుల ఫిట్‌నెస్‌పై విద్యా సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరో పది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. గ్రేటర్‌లో పది వేలకుపైగా స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలకు దూరంగా ఉన్నాయి. దీంతో స్కూల్ బస్సులకు జరగాల్సిన పరీక్షలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. మే 15తో బడి బస్సులకు ఫిట్‌నెస్ గడువు ముగిసిన విషయం విదితమే. ఆ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి. కానీ సరిగ్గా అమలు కావడం లేదు. ఫలితంగా గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో దాదాపు 13వేలకుపైగా స్కూల్ బస్సులుండగా.. 3200 బస్సులకు మాత్రమే ఎఫ్‌సీలు జారీ అయ్యాయి. మిగతా బస్సుల విషయంలో పదిరోజుల పాటు ఆర్టీఏ అధికారులు వేచిచూసి.. అనంతరం ఫిట్‌నెస్ లేకుండా రోడ్డెక్కితే బస్సు సీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 12 ఆర్టీఏ కేంద్రాలున్నాయి. ఈ జిల్లాల్లో మొత్తం 13,082 స్కూల్ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఐదు జోన్లలో 2231 బస్సులుండగా.. ఇప్పటివరకు 300 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 5వేల బస్సులకుగాను 1400 బస్సులకు ఫిట్‌నెస్ పత్రాలు జారీ చేయగా.. మేడ్చల్‌లో 1521 స్కూళ్ల బస్సులకు ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ లెక్కన గ్రేటర్‌లో ఇప్పటివరకు 3వేలకుపైగా బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 12వ తేదీలోగా దాదాపు 10వేల బస్సులకు వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే, సుమారు వెయ్యికిపైగా కాలం చెల్లిన బస్సులున్నాయి. వీటికి ఫిట్‌నెస్‌కు అనుమతించారు. స్క్రాప్ చేయాల్సిందే. కానీ కొన్ని విద్యా సంస్థలు దొంగచాటుగా ఈ బస్సులను నడుపుతున్నాయని సమాచారం. ఇలాంటి బస్సుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి.
పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం!
పాఠశాలల పున:ప్రారంభానికి మరో పది రోజులే సయమముంది. ఈ నేపథ్యంలో రోజుకు వెయ్యి చొప్పున బస్సులను పరీక్షించితే తప్ప.. ఈ పది రోజుల్లో పది వేల బస్సుల పరిశీలన పూర్తి కాదు. అయితే, జూన్ మొదటి వారం నుంచి రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని.. ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని పేర్కొంటున్నారు. బడి బస్సుల ఫిట్‌నెస్ ముగిసి 12 రోజులు అవుతోంది. కానీ ఆయా స్కూళ్ల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్ విషయంలో ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ.. పిల్లల భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతియేటా మే 15తో బస్సుల ఫిట్‌నెస్ గడువు ముగిసే విషయం తెలిసిందే. అలాంటప్పుడు రవాణాశాఖ అధికారులు ముందస్తుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి.. ప్రయివేటు విద్యా సంస్థల బస్సులు ఫిట్‌నెస్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు. తద్వారా రవాణాశాఖకు ఆదాయం పెరగడం, రోడ్డు ప్రమాదాలు నివారించడంతోపాటు పిల్లలకు భద్రత కల్పించవచ్చు. ఆ దిశగా రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇవి నిబంధనలు..
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పాఠశాల బస్సులకు రవాణా శాఖ సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షల్లో భాగంగా.. బ్రేకులు, ఇంజన్ పనితీరు, డోర్లు, డ్రైవర్ అనుభవం తదితర అంశాలను పరిశీలిస్తారు. డ్రైవర్‌కు కనీసం అయిదేండ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్ లైసెన్స్‌తోపాటు క్లీనర్ ఫొటోలు, ఫోన్ నంబర్లు వాహనంలో ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే లెక్కని, వారి తల్లితండ్రుల ఫోన్ నంబర్లు సహా బస్సులో అతికించాలి. బస్సు రూట్‌మ్యాప్‌ని ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలను అనుమతించరు. విద్యాసంస్థల బస్సులకు పసుపురంగు వేసి నాలుగు వైపులా ఆర్టీఏ రిజిస్ట్రేషన్ నంబర్ రాయాలి. కొత్త టైర్లతోపాటు స్టెప్నీ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తప్పనిసరి. వర్షం పడితే నీళ్లు లోపలికి రాకుండా బస్సు టాప్‌పై సీలింగ్ ఉండాలి. ప్రతి మూడు నెలలకోసారి డ్రైవర్ వైద్య పరీక్షలు చేసుకోవాలి. ఈ ఖర్చు యాజమాన్యమే భరించాలి. డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. ఇలా మొత్తం 30-40 నియమ నిబంధనలను పాటించిన బస్సులకు మాత్రమే ఎఫ్‌సీ మంజూరు చేస్తారు.