Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏవియాకాన్స్ అధినేత వి.సత్యభూషణరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పౌర విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలున్నాయని ఏవియాకాన్స్ ఇన్‌స్టిట్యూషన్ అధినేత వి.సత్య భూషణరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సింగపూర్‌కు చెందిన ఏవియేషన్ రంగంలో అగ్రగామిగా పేరుగాంచిన ఎంబ్రీ రిడిల్ ఏయిరోనాటికల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. దీంతో బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్ ఏయిరోనాటిక్స్ (బీఎస్‌ఏ), బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్-ఏవియేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీఎస్‌ఏబీఏ) కోర్సులతో పాటు ఏడు సర్టిఫికేట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పైలెట్, క్యాబిన్ తదితర శిక్షణ ఇచ్చే సౌకర్యాలే ఉన్నాయనీ, తొలిసారిగా మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. ఈ కోర్సులను అభ్యసించేందుకు వీలుగా విద్యార్థులకు బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేందుకు సహకరిస్తున్నామని చెప్పారు. కోర్సును చదివేందుకు విద్యార్థులు ఆన్ సైట్, ఆన్ లైన్, ఆన్ క్యాంపస్ విధానాల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే విమానాశ్రయాల్లో పని చేస్తున్న వారు కూడా ఈ కోర్సులు చేసే వీలుందని వివరించారు. రాబోయే ఐదు నుంచి ఏడేండ్ల కాలంలో భారత దేశంలో మరో వంద విమానాశ్రయాలు రానున్నాయనీ, అందువల్ల ఈ కోర్సు చేసిన వారికి చెప్పుకోదగ్గ డిమాండ్ ఉంటుందన్నారు. విమానయానరంగంలో ప్రస్తుతం 2.5 లక్షల సిబ్బంది ఉన్నారనీ, భవిష్యత్తులో నైపుణ్యత కలిగిన సిబ్బందికి మంచి ఆఫర్ ఉంటుందని చెప్పారు.