Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో ఆరు కొత్త కోర్సులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యారంగంలో వస్తున్న మార్పులు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆరు కొత్త కోర్సులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించినట్టు సమాచారం. ఈ క్రమంలో సంప్రదాయంగా వస్తున్న కోర్సులకు అదనంగా మరో ఆరు కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంటర్ బోర్డు ఈ కోర్సులను ప్రారంభించాలని భావిస్తున్నది. అందులో టెక్నికల్, కామర్స్ కోర్సులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. డేటాసైన్స్, డేటా అనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నెట్ వర్కింగ్ అండ్ పబ్లిక్ పాలసీ, మైనింగ్ సబ్జెక్ట్లతో కాంబినేషన్ల ద్వారా కొత్త కోర్సులు తేవాలని ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ఇంటర్ విద్యలో ప్రస్తుతం జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులతోపాటు ఒకేషనల్ విభాగంలో పలు కోర్సులున్న విషయం తెలిసిందే.