Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు తలసాని సవాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారుగా దమ్ముంటే మా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మాతో పోటీకి సిద్ధమవుతారా?' అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీకి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ప్రధానమంత్రి డ్రామాలు చూస్తున్నాం, ఎక్కడ ఎన్నికలుంటే ఆ వేషం వేస్తారు. రోజుకు 10 డ్రెస్సులు మార్చి ఫ్యాషన్ షో చేయడమే ఆయనకు తెలుసు' అని విమర్శించారు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రులు ఎందుకు రావడం లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దావోస్ సదస్సులో అన్ని రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణకే ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్ చరిష్మా చూసి తట్టుకోలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని చెప్పారు. పసలేని ఆరోపణలు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో మోడీ చెప్పగలిగారా అని ప్రశ్నించారు.
ప్రధానికి బీసీలు పట్టరు : మంత్రి గంగుల
'52 ఇంచుల ప్రధాని మోడీ చాతీ బీసీలను ఎందుకు పట్టించుకోవడం లేదు' అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ది ఉద్యమ కుటుంబం అని చెప్పారు. ఆయన పాలనలో బీసీలు సగర్వంగా జీవిస్తున్నారని చెప్పారు. గతంలో ఉన్న 19 బీసీ గురుకులాల సంఖ్యను 281కి పెంచి 1,50,000 మంది బీసీ బిడ్డల్ని చదువిపిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వారికి ప్రత్యేక మంత్రిత్వశాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప తెలంగాణకు ప్రధాని ఇచ్చింది ఏమీలేదన్నారు.