Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికీ సంక్లిష్ట శస్త్రచికిత్సలకు ప్రయివేటుకే..
- కార్పొరేట్‌ను ఎదుర్కొనడంలో వెనుకబడుతున్న సర్కారు దవాఖానాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. గతంతో పోలిస్తే ఆ దవాఖానాలకు వచ్చే వారి సంఖ్య 20 శాతం పెరిగింది. అందుకు తగినట్టు సౌకర్యాలు సమకూరుస్తూ ఈ నమ్మకాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతాం....' ఇవి పదే పదే అధికారపక్ష నేతల నుంచి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న మాటలు. కొన్ని కొలమానాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఇంకా పలు రకాల చికిత్సల విషయంలో కార్పొరేటు, ప్రయివేటుకే రోగులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా ఆస్పత్రులు వసూళ్లు చేసే భారీ దోపిడీని తట్టుకోలేక చివరి నిమిషంలో ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటిలో సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యుల వద్దకు సంక్లిష్ట కేసులే ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తున్నది. లోపల చికిత్స మాటేమో గానీ ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులు ప్రవేశం దగ్గర నుంచి రోగికి అవసరమైన సమాచారాన్ని విడమర్చి చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. పీఆర్వో, మార్కెటింగ్ వంటి విభాగాలను ప్రత్యేకంగా నెలకొల్పుకున్నాయి. దీనికి తోడు అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో డాక్టర్లకు టార్గెట్లను నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఇందుకు సంబంధించిన వివాదాలు వెలుగులోకి వచ్చిన సందర్భాలున్నాయి. దీంతో పలు ప్రయివేటు ఆస్పత్రులు గ్రామాల నుంచి రోగులను సిఫారసు చేసే వారికి కమిషన్లు ముట్టజెబుతున్నారనేది సర్వత్రా వినపడుతున్న విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రాష్ట్రంలోని ఆస్పత్రుల సేవలకు సంబంధించి కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులదే సింహభాగం కావడం గమనార్హం. ప్రభుత్వ దవాఖానాల్లో పెరిగిన రోగుల సంఖ్యకు తగినట్టుగా డాక్టర్ల సంఖ్య పెంచకపోవడం, సౌకర్యాలను కల్పించకపోవడం, వచ్చే రోగులకు అందించబోయే చికిత్సకు సంబంధించి వివరించే వ్యవస్థ లేకపోవడం, గుండె తదితర ఆపరేషన్లకు సంబంధించిన రోగుల విషయంలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటం తదితర కారణాలు కూడా వారిని ప్రయివేటుకు ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉండటంతో ప్రభుత్వాస్పత్రి కన్నా ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లడంపై రోగులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రయివేటు ఆస్పత్రుల్లో భారీగా వసూళ్లు చేస్తుండటంతో చికిత్స మధ్యలో తిరిగి ప్రభుత్వాస్పత్రికి వస్తున్నట్టు బోధనాస్పత్రుల వైద్యులు చెబుతున్నారు.
సౌకర్యాలపై ప్రచారమేది?
కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉండగా, అవి 56 శాతానికి చేరాయి. డెలివరీల్లో సి-సెక్షన్ లు 60 శాతముండగా, అందులో అత్యధికంగా ప్రయివేటులోనే జరుగుతుండటం గమనార్హం. వీటిని తగ్గించేందుకు సర్కారు ప్రయత్నాలు మొదలెట్టింది. ప్రయివేటు దోపిడీకి ముకుతాడు వేసి సర్కారు దవాఖానాలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచడమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. అదే స్థాయిలో మిగిలిన శస్త్రచికిత్సల విషయంలో జరగకపోవడం గమనార్హం. మోకాలిచిప్పల మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించిన డాక్టర్ల సంఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో అధికంగా ఉన్నప్పటికీ ప్రయివేటులోనే ఎక్కువగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గుర్తించింది. దిద్దుబాటు చర్యగా ప్రభుత్వ డాక్టర్లను రోగుల వద్దకే పంపేలా ఆస్పత్రి బయట జనావాసాల నడుమ శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు రోగులకు ఒకే రోజులో నిర్ణయించిన సమయంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయడం ద్వారా అక్కడి వైద్యులు తాము కార్పొరేట్‌కు తీసిపోమని నిరూపించారు. అందువల్ల మిగిలిన విభాగాల విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా విభాగాల ద్వారా శిబిరాల ఏర్పాటు, రోగులను గుర్తించడం, సత్వర చికిత్స అందించడం, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై ప్రచారం చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు మరింత విశ్వాసం పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.