Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్పిఐ మద్దతు
- కేంద్ర మంత్రి రాందాస్ అధవాలె
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కింద రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్ అధవాలె స్పష్టం చేశారు. శుక్రవారం హన్మకొండ జిల్లాకు వచ్చిన మంత్రి రాందాస్ అధవాలె కాజీపేట 'నిట్'లో కేంద్ర పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నందున కేంద్ర నిధులు ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రజలకు అందుతున్నట్టేనని తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, ఒబీసీ కమిషన్, ఫైనాన్స్ కమిషన్లు పనిచేస్తాయన్నారు. దేశంలో 85 శాతం మంది ప్రజలు తన శాఖ పరిధిలో లబ్దిపొందుతారన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద దేశంలో 25.15 కోట్ల ఖాతాలు తెరిస్తే తెలంగాణలో 1.04 కోట్ల ఖాతాలను తెరిచారన్నారు. 'ముద్ర' పథకం కింద లబ్దిదారులకు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల మేరకు రుణాలు ఇస్తున్నామన్నారు. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద దేశంలో 9.10 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, తెలంగాణలో 10.73 లక్షల మందికి ఇచ్చామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో దేశంలో 58.49 కోట్ల మందికి పక్కా గృహాలను నిర్మించి ఇవ్వగా, తెలంగాణలో 2.18 లక్షల మందికి ఇచ్చినట్టు చెప్పారు. పీఎం ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో 3.35 కోట్ల మంది లబ్ది చేకూరగా, తెలంగాణలో 3.82 లక్షల మంది ఆరోగ్య సేవలు పొందుతున్నారన్నారు. ఈ పథకం కింద ఆరోగ్య సేవలకుగాను రూ.5 లక్షల మేరకు సాయం చేస్తున్నట్టు చెప్పారు. ఎన్ఎస్సీఎఫ్సీ కింద దేశంలో 34.42 కోట్ల మందికి రుణలను మంజూరు చేయడం జరిగిందని, తెలంగాణలో 51.42 లక్షల మందికి ఈ పథకం కింద రుణాలను మంజూరు చేశామన్నారు.
తెలంగాణకు ఆర్పీఐ మద్దతు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) మద్దతునిచ్చిందన్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్రలోని విదర్భ రాష్ట్ర డిమాండ్ ఉందని, అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించామన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీల ప్రభుత్వాలు లేవన్నారు. మహారాష్ట్రలో మా ప్రభుత్వం లేదని, అయినా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, దాని కింద ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. అదే విధంగా తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా కేంద్ర పథకాల ద్వారా నిధులు వస్తున్నాయన్నారు.