Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు వయోపరిమితి పెంపుతో లక్షా నాలుగు వేల మంది అభ్యర్థులకు లబ్ది
- దరఖాస్తు చేసుకున్నవారిలో 51 శాతం మంది బీసీలు, 41 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు : టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
చివరి క్షణంలో ఏవైనా మార్పులు జరిగితే తప్పా దాదాపుగా ఆగస్టు నెలలోనే ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వీవీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. శుక్రవారం 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ.. గతంలో తాను నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ కంటే ఇప్పుడు దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. గతంలో దాదాపు 18 వేల పోలీసు పోస్టులకు నియామక ప్రక్రియ నిర్వహించామనీ, ఇప్పుడు 17,516 పోస్టులకు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నిర్ణయించిన ప్రకారం ఎస్సై, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 21న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. చివరి క్షణంలో ఏదైనా మార్పులు జరిగితే తప్పా ఇవే తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులకు ఈనెల 25 చివరి తేదీ కావటంతో ఆన్లైన్లో 12,91,094 దరఖాస్తులు అందాయని చెప్పారు. ఇందులో 21 శాతం మహిళా అభ్యర్థుల దరఖాస్తులున్నాయని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యపేట, ఖమ్మం జిల్లాల నుంచి అత్యధికంగా దరఖాస్తులు రాగా.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి నుంచి అతి తక్కువగా దరఖాస్తులందాయని ఆయన తెలిపారు.
ఈ దరఖాస్తుల్లో 51 శాతం మంది బీసీ లు ఉండగా, 41 శాతం ఎస్సీ, ఎస్టీలున్నారని శ్రీనివాస్‌రావు తెలిపారు. కాగా, 69 శాతం మంది తెలుగులో రాయడానికి ఇష్టపడగా, 32 శాతం మంది ఇంగ్లీషులో రాయడానికి ఆసక్తి చూపారని ఆయన చెప్పారు. కాగా, ఉర్దూలో రెండు శాతం మంది రాయడానికి ఉత్సుకతను చూపించారని వివరించారు. 52 శాతం మంది అభ్యర్థులు కేవలం ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. మిగతావారు రెండు నుంచి ఆరు పోస్టులకు కోసం దరఖాస్తు చేసుకొన్నారని ఆయన వివరించారు. ఐదేండ్లు వయోపరిమితి పెంపుతో అదనంగా లక్షా నాలుగువేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించిందని శ్రీనివాస్ రావు తెలిపారు. కట్టుదిట్టమైన వ్యూహంతో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామనీ, ఎవరైనా దళారులు తాము పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశ చూపి అభ్యర్థులను ఏమారిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసు, జైళ్లు, ఫైర్ సర్వీసు లతో పాటు అదనంగా రవాణా, ఎక్సైజ్ విభాగాల అధికారులు, సిబ్బంది నియామక ప్రక్రియను కూడా సవాలుగా స్వీకరించి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేస్తామని శ్రీనివాస్‌రావు చెప్పారు. జులైలో అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 12,91,094 మంది దరఖాస్తులలో అసలు అభ్యర్థులు 7,33,555 మంది అని ఆయన తెలిపారు.