Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లల్లో నాటిన మొక్కలు 243 కోట్లు
- పెరిగిన గ్రీన్ కవరేజీ 7.7 శాతం
- 9.65 లక్షల ఎకరాల అడవుల పునరుద్ధరణ
- 109 అర్బన్ ఫారెస్టులు అభివృద్ధి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రమొచ్చేనాటికి 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచి పర్యావరణాన్ని కాపాడటమే ధ్యేయంగా 230 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర సర్కారు తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎనిమిదేండ్లలో 8,511 కోట్ల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటారు. దీని ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం క్రమంగా పెరుగుతున్నది. ఇందుకు సంబంధించిన అనేక విషయాలను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి. నాలుగేండ్లలో 7.7 శాతం పచ్చదనం పెరిగినట్టు ధ్రువీకరిస్తున్నాయి. రాష్ట్రంలో 9.65 లక్షల ఎకరాలలో అడవుల పునరుద్ధరణ సాధించినట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో కొత్తగా 109 అర్బన్ ఫారెస్టులను అభివృద్ధి చేశారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం..అందరికీ ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతున్నది. జీవవైవిధ్యం కూడా రాష్ట్రంలో పెరుగుతున్నది. హరితహారం స్పూర్తితో పుట్టుకొచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం విదితమే. భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజిల్ తర్వాత జరుగుతున్న మూడో అతి పెద్ద మానవ మహా ప్రయత్నం ''తెలంగాణకు హరితహారం'' కార్యక్రమం గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం 2015 జూలై మూడో తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఈ ఎనిమిదేండ్ల కాలంలో రూ.8,511 కోట్ల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటారు. క్షీణించిన అటవీ ప్రాంతంలో మళ్లీ అడవులను సృష్టించేందుకు చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో 9 లక్షల 65 వేల ఎకరాల అడవుల పునరుద్ధరణ జరిగింది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగర, పట్టణ ప్రాంతాలల్లో పచ్చదనం పెంచడం, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు గానూ 109 అర్బన్ ఫారెస్టులు అభివద్ధి చేయబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకుగానూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పద్ధతిలో 'గ్రీన్ బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హరిత నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకునేలా చర్యలు చేపట్టింది. పట్టణ, నగర పాలక సంస్థలు, స్థానిక సంస్థల్లో కూడా ప్రత్యేకంగా 10శాతం గ్రీన్ బడ్జెట్ ను కేటాయించి, ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని12,769 గ్రామ పంచాయతీలలో మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారే తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను సమకూర్చడం వల్ల, అవి మొక్కల సంరక్షణకు కూడా ఉపయోగపడుతున్నాయి. మొక్కలను సంరక్షించే పూర్తి బాధ్యతను గ్రామపంచాయతీలకే రాష్ట్ర సర్కారు కట్టబెట్టింది. అటవీ, గ్రామీణాభివద్ధి, మున్సిపల్ శాఖలు వాటి నిర్వహణను చూస్తున్నాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మొక్కల రక్షణకు బాధ్యత వహించని వ్యక్తులు, సంస్థలపై తగిన చర్యలను కూడా ప్రభుత్వం చట్టంలో ప్రతిపాదించింది. అస్తిపన్నుకు సమానమైన జరిమానా విధించే అవకాశముంది. జిల్లాల వారీగా కలెక్టర్ నేతత్వంలో కమిటీలను వేశారు. దీంతో హరితహారం కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నదని అటవీశాఖ వెల్లడించింది.