Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మృతుల కుటుంబాల ఎదురుచూపు
- దరఖాస్తులు చేసి ఏడాదైనా అంతే సంగతి
- ఎవరిని అడగాలో తెలియని అయోమయస్థితి
- కోవిడ్ వార్డులో మరణించినా కరోనా కాదట!
- ఈ నెపంతో సగానికి పైగా దరఖాస్తుల తిరస్కరణ
నవతెలంగాణ-ఖమ్మం, మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధులు
''ఖమ్మం జిల్లా అర్బన్ మండలం గొల్లగూడెం రోడ్డులో ఉంటున్న గుర్రం కృష్ణకూమారి కోవిడ్‌తో మృతిచెందారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన ఆమె కుమారుడు రాజేష్ రూ.50వేల ఎక్స్‌గ్రేషియా కోసం మీ సేవలో అప్లై చేశారు. అప్లికేషన్ అప్రూవల్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. కానీ ఇంత వరకూ పరిహారం రాలేదు. దీనిపై ఎవర్ని ఆశ్రయించాలో అర్థం కాని పరిస్థితి ఉందని రాజేష్ తెలిపారు.''
''నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ పరిధిలో భాస్కర్ అనే వ్యక్తి అమ్మ, అన్నా, వదిన కరోనాతో మృతిచెందారు. ఈయన అన్నకు 18 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వీరి బాగోగులు ఈయనే చూస్తున్నారు. కరోనా సాయం అందితే పిల్లల చదువుకు ఉపయోగపడతాయని అంటున్నారు.''
కోవిడ్ మృతుల కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.50వేల అరకొర పరిహారంతో సరిపెట్టాలని నిర్ణయించింది. దానిలోనూ అనేక తిరకాసులు పెట్టింది. కరోనా మూడు వేవ్‌లలో ఎంతో మంది మరణించినా వారిలో సగం మందికి మాత్రమే కరోనాతో చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. ఇది ఒక భాగమైతే కరోనా మృతులుగా పరిగణిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వాటిలోనూ సగం అప్లికేషన్లను రూ.50వేల పరిహారానికి పరిగణనలోకి తీసుకోలేదని మృతుల కుటుంబీకులు వాపోతున్నారు. పరిగణనలోకి తీసుకుని నియమ నిబంధనల మేరకు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నూటికి పదిశాతం మందికి కూడా పరిహారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎక్స్‌గ్రేషియా కోసం ఎన్ని దరఖాస్తులు అందాయి? ఎంత మంది మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు? ఈ విషయాలను వెల్లడించాల్సిన తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టే ఉంటున్నారు.
ఖమ్మం అర్బన్ మండలం 60వ డివిజన్ రామన్నపేటకు చెందిన జూపల్లి వెంకులు. జిల్లా కేంద్ర ఆస్పత్రి కోవిడ్ వార్డులో చనిపోయారు. అయినా సరే కరోనాతో మరణించినట్టు సర్టిఫికెట్ ఇవ్వమని నిరాకరించడంతో ఆయన కుటుంబీకులు డీఎంహెచ్‌వో కార్యాలయం, జిల్లా కేంద్ర ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన కందుకూరి ధనమ్మ మూడురోజుల పాటు ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందింది. రెండురోజుల పాటు సాధారణ వార్డులో ఉంచి, మూడోరోజు కరోనాగా నిర్ధారించి కోవిడ్ వార్డులో ఉంచారు. ఒక రోజు కోవిడ్ వార్డులో ఉన్న అనంతరం ఆమె గతేడాది మే 18న మరణించారు. కానీ ఆమె కరోనాతో చనిపోయినట్టు అధికారులు మరణ ధ్రువీకరణపత్రం ఇవ్వకపోవడం గమనార్హం.
దరఖాస్తు అప్రూవల్ అయినా అంతే సంగతులు...
ఖమ్మం జిల్లాలో మొత్తం మూడువేవ్లలో కరోనాతో 2,257 మందివరకూ మరణించారు. ఈ మేరకు వీరి కుటుంబీకులు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోగా వివిధ కారణాలతో వందలోపు దరఖాస్తులు తిరస్కరించారు. అప్రూవల్ అయిన దరఖాస్తులకు సంబంధించి ఎంతమందికి పరిహారం ఇచ్చారనే విషయంలో అధికారులు స్పష్టతనివ్వడం లేదు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1179 దరఖాస్తులు రాగా 1095 పరిగణలోకి తీసుకున్నారు. 52 దరఖాస్తులను తిరస్కరించారు. ఆమోదించిన దరఖాస్తుల్లోనూ సగం మందికి కూడా ఎక్స్‌గ్రేషియా అందలేదు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 1.5లక్షల మంది కరోనా బారిన పడగా.. 450 మంది మరణించారు. నారాయణపేట జిల్లాలో 99వేల మందికి కరోనా వచ్చింది. 311 మృతిచెందారు. గద్వాల జిల్లాలో 87 వేల మంది కరోనా బారిన పడగా, 271 మంది మరణించారు. వనపర్తి జిల్లాలో 93 వేల మందికి కరోనా రాగా, 311 చనిపోయారు. నాగర్‌కర్నూల్‌లో 1.15లక్షల మందికి కరోనా వస్తే.. 500 మందిని వైరస్ కబలించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం 8 నెలల కిందట ప్రకటన చేసింది. ఆర్థిక సహాయం కోసం గద్వాలలో 271, వనపర్తిలో 211 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలించి వైద్య పరీక్షల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి పంపారు. కానీ నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదు.
దరఖాస్తుల్లో తిరకాసులు...
కోవిడ్ డెత్ ఎక్స్‌గ్రేషియా కోసం సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి మీసేవ కేంద్రాల్లో కుటుంబీకులు అప్లై చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ సభ్యులుగా ఉండే 'కరోనా మరణ నిర్ధారణ కమిటీ కోవిడ్-19' ధ్రువీకరించి సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. తదనంతరం ఎక్స్‌గ్రేషియాను కుటుంబీకుల అకౌంట్లలో జమ చేస్తారు. కోవిడ్ పాజిటివ్ రిపోర్టుతో పాటు మున్సిపాలిటీ/ పంచాయతీ జారీ చేసిన మరణ ధ్రువీకరణపత్రం ఇచ్చినా అధికారులు ఒప్పుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ రిపోర్టు లేకపోతే వైరస్ కారణంగా అడ్మిట్ అయిన ఆస్పత్రి నుంచి మరణాన్ని ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి, లేదంటే కరోనా చికిత్సకు సంబంధించిన పరీక్షల బిల్లులు జత చేసినా సరిపోతుంది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదని మృతుల కుటుంబీకులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా ఉన్న ఈ కమిటీ ఎక్స్‌గ్రేషియా విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతుండటం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. ఈ విషయమై డీఎంహెచ్వోలు కూడా సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
దరఖాస్తులు కలెక్టర్‌కు పంపుతున్నాం
సుధాకర్ లాల్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్
బాధిత కుటుంబాల నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వీటన్నిటిని ఎప్పటికప్పుడూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుంది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే చేసుకోవాలి.