Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల విద్యలో పైరవీల జోరు
- అంతర్జిల్లా బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం
- సిద్ధిపేట నుంచి మేడ్చల్‌కు వచ్చేందుకు యత్నం
- ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సిఫారసు
- లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణ
- 317 జీవోపై అప్పీళ్లు తేలని వైనం
- స్పౌజ్, పరస్పర బదిలీలూ అంతే...
- సర్కారు తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు దొడ్డిదారిన యధేచ్చగా జరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖలో పైరవీల జోరు సాగుతున్నది. బదిలీలపై నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ పైసలుండి పైరవీ చేస్తే ఈ ప్రభుత్వంలో బదిలీలు జరుగుతాయి. రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాల్సిన సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ దొడ్డిదారి బదిలీలకు కేంద్రంగా ఉండడం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా అంతర్ జిల్లా బదిలీలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తున్నది. మెడికల్ గ్రౌండ్ పేరుతో కొన్ని కారణాలు చూపి అంతర్ జిల్లా బదిలీకి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సిద్ధిపేట జిల్లా నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఓ ఉపాధ్యాయురాలిని అంతర్ జిల్లా బదిలీ చేసేందుకు పాఠశాలల్లోని ఖాళీలు, విద్యార్థుల వివరాలను పంపాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆ జిల్లా డీఈవోని ఆదేశించింది. డీఈవో అభిప్రాయం ప్రభుత్వానికి పంపగానే ఉత్తర్వులు వెలువడతాయి. దొడ్డిదారిలో బదిలీలు జరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇంకా బయటికి రాకుండా గుట్టుగా జరుగుతున్న బదిలీలు మరిన్ని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం ఉపాధ్యాయుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోవైపు 317 జీవోపై ఉన్న అప్పీళ్లు పరిష్కారానికి నోచుకోలేదు. భార్యాభర్తలు (స్పౌజ్), పరస్పర బదిలీల అంశాలు ఇంకా తేలలేదు. వాటిని పరిష్కరించాలని వందలాది మంది ఉపాధ్యాయులు పలు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. మంత్రులు, విద్యాశాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సైతం ఇచ్చారు. అయినా ప్రయోజనం లేదు. కానీ దొడ్డిదారిలో అంతర్జిల్లా బదిలీలు చేపట్టడం వివాదాస్పదం అవుతున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దొడ్డిదారి బదిలీలను చేపట్టొద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ బదిలీలను నిలిపివేయాలని కోరుతున్నాయి. అయితే అంతర్జిల్లా భార్యాభర్తలు, పరస్పర బదిలీలు చేపట్టాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. కానీ పైరవీ బదిలీలకు మాత్రం పచ్చజెండా ఊపడం విమర్శలకు తావిస్తున్నది. ఇంకోవైపు పరస్పర బదిలీలకు సంబంధించి సీనియార్టీ లేకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సీనియార్టీకి రక్షణ కల్పిస్తూ ఈ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు.
పైరవీ బదిలీలు అన్యాయం : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో దొడ్డిదారిలో పైరవీ బదిలీలు చేపట్టడం అన్యాయం. ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఉపాధ్యాయులందరికీ ఆ బదిలీల అవకాశం కల్పించాలి. బదిలీల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలి. భార్యాభర్తలు, పరస్పర బదిలీలను న్యాయబద్ధంగా చేయాలి. అవి చేయకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. సాధారణ బదిలీలకూ షెడ్యూల్ ఇవ్వడం లేదు. కానీ పైరవీ బదిలీలు చేయడం వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతుంది. ఉపాధ్యాయుల్లో అసంతృప్తి పెరుగుతున్నది. భార్యాభర్తలు, పరస్పర బదిలీలను ప్రభుత్వం పరిష్కరించాలి.