Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంపు బాధితుల భారీ ధర్నా
- ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలి
- కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ.. బైటాయింపు
- సొమ్మసిల్లిన మహిళా రైతులు
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
''రైతులను ముంచే ప్రాజెక్టు మాకొద్దు.. మల్లన్న సాగర్‌లో నడిచినట్టు మంచిప్పలో నడవదు.. మా ఊరి భూములు మాకు కావాలి.. చావనైనా చస్తాం.. కానీ ప్రాజెక్టులకు భూములివ్వబోం..'' అంటూ మంచిప్ప ప్రాజెక్టు ముంపు బాధితులు కలెక్టరేట్‌కు కదం తొక్కారు. కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన మంచిప్ప-కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే నిర్మించాలని శనివారం కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. కొండెం చెరువు రిజర్వాయర్ ముంపు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ బయటకు రావాలి.. కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లుందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో మహిళలు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాల కిందట ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద 1.5టీఎంసీ నిల్వ ఎత్తిపోతల పథకాన్ని, లిఫ్ట్ కొండెం చెరువు (మంచిప్ప) పనులను ప్రారంభించారని చెప్పారు. ఇందులో ముంపునకు గురైన రైతులు భూములు కోల్పోయారని, వారికి నేటికీ నష్టపరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ పూర్తయితే లక్షా 83 వేల ఎకరాలు సాగవుతుందని ఆనాటి అధికారులు ప్రకటించారని చెప్పారు. కొంతమంది నష్టపోయినా మిగతా భూములు సాగులోకి వస్తాయని త్యాగం చేశామని తెలిపారు. కానీ, ప్రభుత్వం భూనిర్వాసితులకు సహకారం అందించలేదని, కొండెం చెరువు రిజర్వాయర్ పాత డిజైన్ కాకుండా 3.5 టీఎంసీల నీటితో ఎత్తు పెంచుతూ ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ నూతన ప్రతిపాదనతో వెయ్యి ఎకరాల సాగు మాత్రమే పెరుగుతుందని వివరించారు. కానీ, మేజర్ గ్రామ పంచాయతీ భూములు సర్వం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దీనిపై చర్చ నిర్వహించేందుకు వందలాది మంది బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారని చెప్పారు. కానీ పోలీసులు కలెక్టర్‌ను కలువనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో వృద్ధ మహిళా రైతులు సోమ్మసిల్లి పడిపోయారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్ రాకపోవడంతో బాధితులు రెండు గంటలపాటు వేచి చూసి వినతిపత్రాన్ని గేటుకు అతికించి వెనుదిరిగారు.