Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : మృతురాలి బంధువుల
- ఆర్మూర్ పట్టణంలో రాస్తోరోకో
నవతెలంగాణ-ఏర్గట్ల/ఆర్మూర్
వరకట్న వేధింపులకు మహిళ బలైంది.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ పుట్టింటి వారు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకెళ్తే..
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన అజీస్తో నిర్మల్ జిల్లా మోటపూర్ గ్రామానికి చెందిన సమ్రీన్ (24)కు మూడేండ్ల కిందట వివాహం జరిగింది. కట్న కానుకలు ఇచ్చారు. వీరికి రెండేండ్ల బాబు, 7 నెలల పాప ఉంది. అయితే, కొంతకాలంగా రూ.రెండు లక్షల కట్నం తేవాలంటూ అత్తమామలు, భర్త సమ్రీన్ వేధిస్తున్నారు. దాంతో శుక్రవారం సాయంత్రం ఆమె ఇంట్లోని బాత్రూమ్లో ఉరేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నట్టు పుట్టింటివారికి సమాచారం అందించారు. మృతిపై సమ్రీన్ బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పరిశీలించి గాయాలను గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి షేక్ హైముద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం నిర్వహించడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని, అలాగే కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్, ఆర్మూర్ ప్రధాన రహదారి నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సము దాయించేందుకు యత్నించగా వినలేదు. దీంతో వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపించారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.