Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కితాబిచ్చిన కేరళ అటవీ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, అటవీ పునరుద్ధరణ పనులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన అటవీకళాశాల, పరిశోధనా సంస్థ బాగున్నాయని కేరళ ఐఎఫ్ఎస్ అధికారులు కీర్తి, మహమ్మద్ షాబాద్ కితాబిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగు సెంట్రల్ నర్సరీతో పాటు నర్సంపల్లి బ్లాక్లో అటవీ పునరుద్దరణ, సింగాయపల్లిలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, గజ్వేల్ పరిసరాల్లో అవెన్యూ ప్లాంటేషన్, కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టు, పల్లె ప్రకృతి వనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులను శుక్ర, శనివారాల్లో వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల నాటడం ద్వారా అడవులను పరిరక్షించిన విధానం చాలా బాగుందనీ, అటవీ అధికారులు, సిబ్బంది పనితీరుకు ఇది నిదర్శనమని అభినందించారు. ఔటర్ రింగు రోడ్డు వెంట పచ్చదనం పెంపు అద్భుతంగా ఉందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అటవీ విద్యను కొత్త పుంతలు తొక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ అధికారుల పర్యటనలో ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ శరవనన్, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీధర్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.