Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ సంపదను కాపాడుతున్నది ఆదివాసీ గిరిజనులే
- వారికి మెరుగైన విద్య, వైద్య సేవలను అందించాలి : ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ సంపదను, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని నిజంగా కాపాడుతున్నది ఆదివాసీ గిరిజనులేనని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తెలంగాణ వస్తే తమ పోడు భూములకు పట్టాలువస్తాయని ఆశించిన లక్షలాది ఆదివాసీ గిరిజనులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు వెంటనే వాటికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోడుభూములకు పట్టాలివ్వాలి..నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తేవాలి..ప్రజా సమస్యలను పరిష్కారించాలి..అనే డిమాండ్లతో మహాధర్నా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హరగోపాల్ మాట్లాడుతూ..దేశ సంపదంతా బడా కార్పేరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నదనీ, ప్రతి పదిరోజులకోసారి దేశంలో కొత్త బిలినీయర్లు పుడుతున్నారని వివరించారు. పాలకవర్గాలు సహజవనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం వల్లనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పారు. సహజసంపద, వనరులను కొల్లగొట్టడంలో భాగంగా ఆదివాసీ ప్రాంతాలపై పాలకులు యుద్ధం ప్రకటించడాన్ని మానుకోవాలని సూచించారు. శతకోటీశ్వర్లంతా మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. మీడియాలో ఆదివాసీ గిరిజనుల జీవన స్థితిగతులపై చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పిల్లలకు మెరుగైన విద్యాసౌకర్యాలు కల్పించి ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరారు. ఆదివాసీ గూడేలు, తండాల్లో కనీసం ప్రాథమిక వైద్యసౌకర్యాలైనా కల్పించాలని విన్నవించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీలన్నింటి అమలు కోసం పోరాడాల్సిన ఆవసరం ఉందని నొక్కి చెప్పారు. మహాసభలో 12 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఏఐకేఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రణధీర్, రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య, భాస్కర్, ఉపాధ్యక్షులు ఎం.భిక్షపతి, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ, ఉపాధ్యక్షులు జె.సీతారామయ్య, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పరుశరాం, పీఓడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభద్ర, అరుణోదయ ప్రధాన కార్యదర్శి ఎ.నిర్మల, రాష్ట్ర నాయకులు ఊకే పద్మ, ఆరెళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.