Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్కు చెందిన పలువురు సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు శనివారం ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజరు కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద తదితరులు పూలమాలలేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్‌కు 'భారత రత్న' బిరుదునివ్వాలని మల్లారెడ్డి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్న గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనటాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని నామా అన్నారు. తెలుగు గడ్డపై భూస్వాముల ఆగడాలకు చెక్ పెట్టిన మానవతామూర్తి ఎన్టీఆర్ అని మోత్కుపల్లి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అనీ, ఆయన కృషి వల్లే మహిళలకు ఆస్తిలో హక్కు వచ్చిందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి తదితరులున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కూడా ఆయనకు ఘన నివాళులర్పించారు. శనివారం తెల్లవారుజామున్నే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్... తమ తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని, నటుడు రాజేంద్రప్రసాద్, నటి దివ్యవాణి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.