Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో మెసేజ్
- ఎంపీడీవో వేధింపులే కారణమన్న తోటి ఉద్యోగులు
- జెడ్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
నవతెలంగాణ-సిద్దిపేట, నంగనూరు
ఎంపీడీవో వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పంచాయతీ కార్యదర్శి సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ సిద్దిపేట జిల్లాలో కలకలం రేపింది. ఫోన్ స్విచ్చాఫ్ చేసి సదరు కార్యదర్శి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో కుటుంబీకులు, తోటి ఉద్యోగులు రోజంతా వెతికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శులు జెడ్పీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. కార్యదర్శులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నంగునూరు మండలం పాలమాకుల పంచాయతీ కార్యదర్శిగా రాంప్రసాద్ విధులు నిర్వహిస్తున్నారు. నంగునూరు ఎంపీడీవో మధుసూదన్ తీవ్రంగా వేధిస్తున్నాడని కార్యదర్శి రాంప్రసాద్ సన్నిహితుల వద్ద వాపోయారు. శుక్రవారం సైతం ఎంపీడీవో కార్యదర్శి రాంప్రసాద్‌కు ఫోన్ చేసి ''జిల్లా ఉన్నతాధికారులు నీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, నిన్ను విధుల నుంచి తొలగించాలని సూచించారని'' చెప్పారు. దాంతో రాంప్రసాద్ ఆవేదనకు గురయ్యాడు. దాంతో ఎంపీడీవో వేధింపులు తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఎంపీడీవో ప్రవర్తనతో మండల పంచాయతీ కార్యదర్శలు సైతం ఆవేదనతో ఉన్నారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టి శుక్రవారం ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు, సహ ఉద్యోగులు రాంప్రసాద్ కోసం వెతికారు. అర్ధరాత్రి సయయంలో పట్టణ శివారులో రాంప్రసాద్‌ను గమనించి వెంటనే సిద్దిపేట ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన డాక్టర్లు ఎలాంటి విష పదార్థం తీసుకోలేదని చెప్పడంతో కుంటుంబ సభ్యలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఎంపీడీవో మధుసూదన్ వేధింపులకు నిరసనగా శనివారం సిద్దిపేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాంప్రసాద్, ఇతర పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ.. ఎంపీడీవో మధుసూదన్ తమను బానిసలకంటే హీనంగా చూస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు పనులు చెప్పి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళా ఉద్యోగులను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమావేశాలు నిర్వహిస్తారని, మధ్యలో వాష్‌రూమ్‌కు పోవాలన్నా ఆయన అనుమతి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 'మీకు తినే హక్కు లేదు. నేను మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే ఉన్నతాధికారుల వద్ద నాకు అంత మంచి పేరు వస్తుంది. శ్మశాన వాటికలలో మీ డబ్బుతో బోరు వేయించాలి. లేదా సర్పంచ్ వేయించాలి' అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశం సమయంలో తమ ఫోన్లను ఎంపీడీవో తీసుకొని వాట్సప్, గూగుల్ చెక్ చేస్తారని ఆరోపించారు. సమావేశంలో ఫోన్ వాయిస్ రికార్డు చేస్తామని ఫోన్లను ఆయన వద్దనే ఉంచుకుంటారని తెలిపారు. రాత్రిపూట కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ఉద్యోగులు ఇతర ఉద్యోగులతో కలిసి బైక్‌పై వెళ్తే అనుమానిస్తారన్నారు. గతంలో ఎంపీపీ దృష్టికి తీసుకెళ్తే అందరూ కలిసి పని చేసుకోవాలని సర్ది చెప్పారన్నారు. మీరు ఎక్కడ చెప్పుకున్నా తనకు ఏమీ కాదని, ఉన్నత ఉద్యోగుల అండ తనకు ఉందని భయపెడుతున్నారని తెలి పారు. తక్షణం ఎంపీడీవో మధుసూదన్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎంపీడీవో మధుసూదన్‌ను వివ రణ కోరగా, విధులు సక్రమంగా నిర్వహించాలని సూచిస్తుండటంతోనే పంచాయతీ కార్యదర్శులు తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని తెలిపారు.