Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూల్యాంకనం కేంద్రాల వద్ద పౌరశాస్త్ర అధ్యాపకుల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో పౌరశాస్త్రాన్ని తొలగించొద్దని సివిక్స్ లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. దాని స్థానంలో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులను చేర్చాలన్న ఆలోచనను ఇంటర్ బోర్డు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వరంగల్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని మూల్యాంకన కేంద్రాల వద్ద పౌరశాస్త్ర అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. సమాజానికి ఉత్తమ పౌరులను రూపొందించే సబ్జెక్టు పౌరశాస్త్రమేనని వారు గుర్తు చేశారు. భారత రాజ్యాంగం, ప్రభుత్వ వ్యవహారాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీల విధులకు సంబంధించిన అంశాలు ఈ సబ్జెక్టు ద్వారా తెలపొచ్చని వివరించారు. ఈ అంశంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ స్పాట్ కేంద్రం వద్ద నిరసన తెలిపిన తర్వాత ఇంటర్ విద్యా జాయింట్ డైరెక్టర్ గోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పౌరశాస్త్ర పరిరక్షణ సమితి నాయకులు రమణాకర్, వెంకటయ్య, కుమార్, సాంబశివరావు, బి వెంకయ్య, కొప్పిశెట్టి సురేష్, విజరుమోహన్, రాజిరెడ్డి, వీరాంజనేయులు, గోవర్ధన్, వేణుమాధవి, చంద్రకళ, రజియా తదితరులు పాల్గొన్నారు.