Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి : కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కులదురహంకార హత్యలపై ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలనీ, ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'వరుస కులదురహంకార హత్యలు- ప్రభుత్వాలు పౌర సమాజం పాత్ర' అనే అంశంపై సంఘం అధ్యక్షులు జాన్ వెస్లీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఆర్టీఎస్ విశ్రాంత అధికారి, ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ మాట్లాడుతూ కుల, మత దురహాంకారానికి మరో యువకుడు బలికాకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం, పౌర సమాజం కూడా బాధ్యతతో ఆలోచించాలన్నారు. ఇటీవల కాలంలో వరసగా కులదురహంకార హత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం విచారకరమన్నారు. చట్టబద్దంగా ఇష్టపడి పెండ్లి చేసుకున్నప్పటికీ పరువు పోయిందనే అజ్ఞానంతో మానవీయతను కోల్పోయి నడి రోడ్డుపై నరికి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు కేవలం హిందూ ముస్లిం పంచాయితీ యువతీ యువకుల పట్ల తప్ప వారికి మిగతా కులదురహంకార హత్యలు పట్టవా అని ప్రశ్నించారు కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంక్షేమం కోసం ప్రత్యేక రక్షణ చట్టం, ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. పౌర సమాజం చాలా చైతన్యయుతంగా ఈ సాంఘీక దురాచారాలను ప్రతిఘటించాలని కోరారు.కుల నిర్మూలన సంఘం పూర్వ అధ్యక్షులు సి ఎల్ ఎన్ గాంధీ మాట్లాడుతూ కులదురహంకార హత్యల్లో ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం కనిపిస్తోన్నదని ఆరోపించారు.మనువాద, పురుషాధిక్యతా సమాజంలో స్త్రీని ఒక ఆస్తిగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెట్రేగిపోతున్న నేపధ్యంలో పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ కులాంతర వివాహాలను పౌర సమాజమే ప్రోత్సహించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో రాజేశ్వరి అనే యువతి ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకున్నందుకు కన్న తండ్రే దుర్మార్గంగా హత్యచేశాడని గుర్తుచేశారు. ఈ సంఘటనపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించటంలేదో చెప్పాలన్నారు.
తెలంగాణ సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్కే) కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ కులాంతర వివాహాలన్నీ సమాజ పురోభివృద్దికి బాటలు వేస్తాయని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో మనువాద సాంస్కృతిక కాలుష్యం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు తీర్మానం ప్రవేశపెడుతూ సీఎం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరపాలని డిమాండ్ చేశారు. 2014నుంచి ఇప్పటివరకు దూరహంకార హత్యల్లో బలైన వారి కుటుంబాలను పరామర్శించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.25లక్షలు, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాంస్కృతిక సారథి ద్వారా కులాంతర వివాహాల అవసరాన్ని ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర, ప్రముఖ సామాజిక వెత్త డాక్టర్ స్వామిఅల్వాల్, సామాజిక కార్యకర్త ఇందిర, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎ రాములు, కుల అసమానతల నిర్మూలన పోరాట సంఘం అధ్యక్షులు బండారి లక్ష్మయ్య, కులనిర్మూలన సంఘం కార్యదర్శి డి ఎల్ కృష్ణచంద్, బంధు సోసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి, సుందరయ్య పార్క్ ఉపాధ్యక్షులు ఎం ఎన్ ఆర్ రావు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్, డీ వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం దశరధ్, రిటైర్డ్ పంచాయితీ రాజ్ ప్రత్యేక అధికారి ఈ నర్సింగరావు, నగర కార్యదర్శి కె యాదగిరి తదితరులు పాల్గొన్నారు.