Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వు రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటన
- గిరిజన, ప్రజా సంఘాల ఆందోళనతో స్పందించిన వైనం
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవనంలో జిల్లా కోర్టు ఏర్పాటుపై కలెక్టర్ వెనక్కి తగ్గారు. గిరిజన సంఘాల ఆందోళనతో ప్రస్తుత ఉత్తర్వును రద్దు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీరాం నాయక్, ఆర్.అంజయ్య ఆధ్వర్యంలో ప్రతినిధులు శనివారం జిల్లా కేంద్రం పరిధిలోని పగిడిపల్లి గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ పేమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పగిడిపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ రూ.75 లక్షలతో 3.5 ఎకరాల్లో గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల కోసం కొత్త భవనాన్ని నిర్మించిందని చెప్పారు. ప్రారంభోత్స వానికి సిద్ధంగా ఉన్న ఈ భవనంలో కలెక్టర్ అకస్మాత్తుగా జిల్లా కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ అనాలోచితంగా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరిం చుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. 2018 నుంచి 230 మంది గిరిజన బాలికలు శారదా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ భవనంలో అరకొర వసతులతో చదువులను కొనసాగిస్తున్నా రన్నారు. ఈ తరుణంలో గిరిజన బాలికల పట్ల కనికరం చూపాల్సిన జిల్లా కలెక్టర్.. వారి కోసం కోసం ఏర్పాటు చేసిన భవనంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయించుకొని జిల్లా కోర్టుకు విశాలమైన భవంతులు కట్టాలని సూచించారు. కలెక్టర్ అనాలోచితంగా జారీచేసిన ఉత్తర్వుపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్పర్సన్కు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల కమి షన్తోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. కలెక్టర్ తక్షణం ఉత్తర్వును రద్దు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అయితే, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల భవనంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వుపై కలెక్టర్ వెనక్కి తగ్గారు. గిరిజన, ప్రజాసంఘాల నేపథ్యంలో పాత ఉత్తర్వును రద్దు చేస్తున్నట్టు మరో ఉత్తర్వు జారీ చేశారు. దీంతో గిరిజన, ప్రజా సంఘాల నేతలు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహా, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, ఎఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి.ఇమ్రాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు లావుడియా రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఉప్పల శాంతికుమార్, నాయకులు జానీ పాల్గొన్నారు.