Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా ప్రాంగణాలకు స్థలాల కొరత
- పల్లెల్లో సర్కారు భూముల కోసం అన్వేషణ
- జూన్ 2లోపు మండలానికి రెండు చొప్పున ప్రారంభం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉదేశంతో ప్రభుత్వం పల్లెల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఆటలు ఆడేందుకు అనువైన వాతావరణం కల్పించాలని భావించింది. కానీ ఈ ప్రాంగణాలకు స్థలాల సమస్య ఎదురవుతోంది. తొలివిడతలో మండలానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. మిగతా అన్ని పల్లెల్లోనూ జూన్ నాటికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ పల్లెల్లో సర్కారు స్థలాల కొరత సమస్యగా మారింది. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు స్థలాల సేకరణలో నిమగమయ్యారు. ఇప్పటికే అనువైన స్థలాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో తాజాగా క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలు సేకరించడం కష్టంగా మారుతోంది.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో పంచాయతీలు, అనుబంధ గ్రామాలు కలిపి 16వరకు ఉంటాయి. ఇందులో తొలి విడతలో క్రీడా ప్రాంగణాల ప్రారంభానికి రెండు గ్రామాలను ఎంపిక చేసిన అధికారులు.. మరో ఆరింటిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. మిగతా 8 గ్రామాల్లో సర్కారు స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమస్య దాదాపు అన్ని మండలాల్లోనూ కనిపిస్తోంది.
ఒక్కో క్రీడా ప్రాంగణం కోసం ప్రతి గ్రామంలో ఎకరం స్థలం గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో సౌకర్యాల కోసం ప్రభుత్వం ఉపాధి నిధులు రూ.4.16లక్షలు వెచ్చిస్తోంది. ఈ స్థలంలో వాలీబాల్ కోర్టుతో పాటు ఖోఖో, లాంగ్‌జంప్ తదితర ఆటల కోసం నిర్మాణాలను చేపట్టనున్నారు. తొలి విడతలో మండలానికి రెండు గ్రామాల చొప్పున స్థలాలను ఎంపిక చేసి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద స్థలాలను గుర్తించింది. రెండేసి గ్రామాల చొప్పున ఎంపిక చేసిన అధికారులు వాటిలో ఆయా క్రీడలకు సంబంధించి నిర్మాణాలను చేపడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 34 క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.
స్థలాల కొరతతో
ఇబ్బందులు
క్రీడా ప్రాంగణాల కోసం పల్లెల్లో స్థలాలను సేకరించడం అధికార యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా అనుబంధ గ్రామాలు మరో 1166 పల్లెలు ఉన్నాయి. మొత్తం 1176 పంచాయతీల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు 554 చోట్ల మాత్రమే స్థలాలకు సంబంధించిన జాబితాను తహసీల్దార్లు ఎంపీడీఓలకు అప్పగించారు. మిగతా వాటిలోనూ గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పల్లె ప్రకృతి వనాలకే ఎకరం స్థలం లభించకపోవడంతో అనేక చోట్ల అర ఎకరంలోనే ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్రీడా ప్రాంగణాల కోసం ప్రభుత్వ స్థలాలు లభించడం సమస్యగా మారుతోంది. చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకుండా పోయాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో స్థలం లభించడమే గగనంగా మారింది. మరోపక్క ఈ పథకం కింద ప్రయివేటు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఇబ్బందికరంగా మారుతోంది. ఒక్కో ప్రాంగణం ఏర్పాటుకు ఉపాధిహామీ కింద కేటాయించిన రూ.4.16లక్షలు కేవలం వాటిలో సౌకర్యాల కల్పనకే సరిపోతాయి. స్థలం కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు. దీంతో పల్లెల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు కత్తిమీద సాములా మారింది.
ప్రభుత్వ స్థలాలను సేకరిస్తున్నాం
పల్లెల్లో క్రీడా ప్రాంగణాల కోసం ప్రభుత్వ స్థలాలను సేకరిస్తున్నాం. తొలి విడతలో అన్ని మండలాల్లో రెండేసి చొప్పున స్థలాలను ఎంపిక చేశాం. వీటిలో పనులు చేపట్టి జూన్ 2తేదీన ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నాం. మిగతా అన్ని పల్ల్ల్లెల్లోనూ ఎంపీడీఓలు, ఎంపీఓలు స్థలాలను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- కిషన్- డీఆర్డీఓ- ఆదిలాబాద్