Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా 108 సిబ్బందికి అందని వేతనలు
- సమ్మె యోచనలో ఉద్యోగులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా సమయంలో సమాజం అత్యధికంగా పొగిడిన వ్యక్తులెవరైనా ఉన్నారంటే వారే. 108 ఆపద్భాంధావుల్లా ఇంటి ముందు వారు వచ్చిన శబ్ధం వినిపిస్తే ప్రాణాలు లేచొస్తాయి. తమను కాపాడే వాహనం, వ్యక్తులు ఇంటిముందుకొచ్చారని భరోసా దొరికేది. కరోనా వారియర్లలో ముందు వరసలో ఉన్న వ్యక్తులు వారు. వారిని దేవుళ్లన్నారు. దేవతలని పొగిడారు. వారు సమయానికి స్పందించకుంటే తమ ఆప్తులు దక్కేవారే కారని చేతులెత్తి మొక్కారు. ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించాయి. కాలం గడిచింది. మహమ్మారి నెమ్మదించింది. కథ మొదటికొచ్చింది. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఏ నెల కా నెల జీతం అందుకునే వారు కాస్తా వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాయో స్పష్టత లేక కిరాయికుంటున్న ఇంటి ఓనరుకు, పాలవాడికి, స్కూలు ఫీజులకు తదితర అప్పుల వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల కోసం నడిచే 108 వాహనాల సిబ్బంది వేతనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలకు ఇచ్చే జీతమే తక్కువగా ఉందనీ, దాన్ని పెంచాలని ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఆ ఇచ్చే తక్కువ జీతం కూడా సమయానికి రాకపోవడంతో వారు మరింత ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.ఇటీవల రెండు నెలల జీతం పెండింగ్‌లో ఉండగా మీడియా వెలుగులోకి తెచ్చిన తర్వాత జీతాలను వేశారు. తిరిగి ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రెండు నెలల జీతం పెండింగ్‌లోనే ఉండటంతో సమస్యలతో సతమతవుతూనే వాహనాలను ముందుకు తీసుకెళ్తున్నారు. 108 సేవల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థకు రూ.ఆరు కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 436 వాహనాలను నడుపుతున్నారు. ప్రస్తుతం డీజిల్ కు కూడా డబ్బులు లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారితే వాహనాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
2015 సెప్టెంబర్‌లోనే జీవీకేతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ముగిసినప్పటికీ దానినే కొనసాగిస్తున్నారు. నాటి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటూ ఆ సంస్థే సేవలు కొనసాగిస్తున్నది. అయితే ప్రభుత్వం జీవీకేకు ఎంత మేర నిధులు ఇస్తున్నదనేది ఎవరికి తెలియదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో ఈ సేవలపై సమీక్షించిన మంత్రి, ఉన్నతాధికారులు రేపో, మాపో టెండర్లు పిలుస్తామని చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 108 సేవలు ప్రారంభం కాగా, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చెల్లిస్తున్న జీతాలకు, తెలంగాణలో చెల్లిస్తున్న జీతాలకు భారీ వ్యత్యాసం ఉండటం కూడా ఉద్యోగులను నిరాశకు గురి చేస్తున్నది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)కి ఆంధ్రప్రదేశ్‌లో రూ.30 వేలు, తెలంగాణలో రూ.16 వేలు (జూనియర్లకు రూ.12,500), డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ లో రూ.28 వేలు, తెలంగాణలో పదేండ్ల సీనియర్ అయితే రూ.16 వేల నుంచి రూ.17 వేలు మాత్రమే ఇస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో, ఐటీడీఏ ఏరియాల్లో 108 సేవలు అరకొరగా ఉంటున్నాయి. ఇప్పటికే 104 సేవలను నీరుగార్చిన సర్కారు 108 సేవలను కూడా అదే బాట పట్టిస్తుందా? అనే అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,080 వాహనాలను కొనుగోలు చేయగా, రాష్ట్రంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద దాదాపు 100 వాహనాలను కొత్తగా జత చేశారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక ఒక్కో ఉద్యోగికి రూ.నాలుగు వేలు పెంచడం మినహా వారి డిమాండ్లేవి నెరవేరలేదు. సేవలను ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలి. సిబ్బందిని ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో కండిషన్లో లేని వాహనాలను నడిపించడం కష్టంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. వాటికి బదులుగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆయా ఆస్పత్రులకు కేటాయించి ఉపయోగించని అంబులెన్సులను సమకూరిస్తే మంచిదని సూచిస్తున్నారు.
ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి...భూపాల్
108 అత్యవసర వాహన సేవలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. ప్రయివేటు ఏజెన్సీకి కమిషన్ ఇచ్చే బదులు ఉద్యోగుల సంక్షేమంపై శ్రద్ధ వహిస్తే ప్రజలకు సేవలను మరింత మెరుగ్గా అందించొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రయివేటు యాజమాన్యానికే ఇచ్చేందుకు నిర్ణయిస్తే కనీస వేతనాలు సమయానికి చెల్లించేలా, రెగ్యులర్‌గా ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలకు యాజమాన్య వాటా ఇచ్చేలా పటిష్టంగా ఒప్పందం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.