Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు స్టేతో నిలిచిన పనులు
- ఈసారీ సాగునీరు కష్టమే..
- యథేచ్చగా నల్లమట్టి తరలింపు
- డంపు చేసుకుంటున్న కాంట్రాక్టర్లు
- మట్టి తరలింపును ఆపాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ పనులకు బ్రేకు పడింది. నార్లాపూర్ మొదలుకుని ఉదండాపూర్ వరకు పనులన్నీ నిలిచిపోయాయి. ఒకవైపు కరోనా, మరోవైపు చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే, తమకు పరిహారం ఇచ్చే దాకా పనులు ఆపాలని నిర్వాసిత రైతులు కోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు చెరువులో మట్టి తీయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఓ పర్యావరణ ప్రేమికుడు గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా పనులు నిలిపేయాలని కోర్టు స్టే విధించింది. అయితే, పనులు నిలిచిపోయినా కాంట్రాక్టర్లు నల్లమట్టిని డంపు చేసుకుని విక్రయాలు చేపట్టి కోట్లు గడిస్తున్నారు. వీరి తంతును గమనిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు నల్లమట్టి తరలింపు పనులు ఆపాలని కోరుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి కూడా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు.
కర్వేన రిజర్వాయర్‌కు చెరువులో మట్టి వేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది.. నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడే నల్లమట్టిని కట్టకు ఉపయోగిస్తే.. రైతుల పొలాలకు సారవంతమైన మట్టి కొరత ఏర్పడుతుందని జడ్చర్లకు చెందిన పర్యావరణ ప్రేమికుడు కోస్గీ రాములు గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు.
వట్టెం, ఉదండాపూర్, కుడికిల్ల రిజర్వాయర్ల పరిధిలో భూములు కోల్పోయిన రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేసేదాకా పనులు నిలిపేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం స్టే విధించడంతో రిజర్వాయర్ల పనులు నిలిచిపోయాయి.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరందించాలనే ఉద్దేశంతో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ గ్రామ శివారులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2018లో ప్రారంభించారు. రూ.62 కోట్లతో 120 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. దీని పరిధిలో 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అందులో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేన, ఉదండాపూర్, లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. 90 రోజుల వరద జలాలుగా కేటాయించి మళ్లీ 45రోజులకు తగ్గించారు. ప్రస్తుతం ఏదుల, నార్లాపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా కుందూరు మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామ శివారులో నిరించనున్న రిజర్వాయరు పనులు మొదలు పెట్టలేదు. వట్టెం, కర్వేనా, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వట్టెం రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉదండాపూర్‌కు కూడా రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 14వ ప్యాకేజీని రూ.1700 కోట్లతో ప్రారంభించారు. 15వ ప్యాకేజీ పనులను రూ.15 కోట్లతో చేపట్టారు. పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు రాయల్టీ కింద సుమారు రూ.130 కోట్లు చెల్లించారు. కర్వేన రిజర్వాయర్‌లోని 14, 15 ప్యాకేజీలకు రూ.3,200 కోట్లు కేటాయించారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో పనులు పూర్తిగా నిలిపేశారు.
అడుగడుగునా అడ్డంకులే
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అడుగడునా అడ్డంకులు ఎదురౌతున్నాయి. 2019 కరోనా సమయంలో ఆగిన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ప్రధానంగా బిల్లుల సమస్య తీవ్రంగా ఉంది. దాంతోపాటు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయడంతో పనులు ఆగిపోయాయి. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లు తెలిపిన వివరాల మేరకు వివిధ ఫేజ్‌లలో సుమారు రూ.1600 కోట్లు బకాయిలున్నట్టు సమాచారం. నిధులు విడుదల చేస్తే పనుల్లో పురోగతి ఉండే అవకాశాలు న్నాయి.
యథేచ్చగా నల్లమట్టి తరలింపు
రిజర్వార్ పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు చెరువులు, శిఖం భూములు, ఇతర భూముల నుంచి నల్లమట్టిని తరలించి డంపు చేసుకుంటున్నారు. విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి తరలింపును ఆపాలని ఆయా గ్రామాల రైతులు అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. అధికారులు స్పందించి మట్టి దందాను నివారించాలని కోరుతున్నారు.
పనులు పూర్తి చేసి నీరివ్వాలి
ఎ.రాములు- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- మహబూబ్‌నగర్
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌కు సాగు నీరు ఆశించిన స్థాయిలో సరఫరా లేదు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తే సాగు, తాగు నీటి సమస్య తీరుతుంది. ఆరేండ్ల కిందట చేపట్టిన కర్వేన పనులు నేటికీ పూర్తి కాలేదు. పాలకులు నిర్లక్ష్యం వీడి త్వరలో బిల్లులు మంజూరు చేసి నిర్వాసితులకు న్యాయం చేసి పనులు పూర్తి చేయాలి.