Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదు
- ధరణిలో లోపాలను సవరిస్తే చాలు..
- ఈ నెల 5న అన్ని వామపక్షాలతో సమావేశం ఏర్పాటు
- సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తమ్మినేని
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణలో కాషాయ చిచ్చుపెట్టడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ.. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించేలా బండి సంజరు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నా వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్లోని అణుపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, డీజీ నర్సింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీ నర్సింహారావు సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏప్రిల్‌లో జరిగిన అఖిలభారత మహాసభల్లో తీసుకున్న పార్టీ నిర్ణయాలను సభ ముందుంచారు. ఆ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఈ సభ తీర్మానించింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెబుతూ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని దివాలా తీస్తున్నారని విమర్శించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పార్లమెంట్లో ఒక చట్టం చేసిందని, 1947 ఆగస్టు 15 నాటి ముందు గుడులు, మసీదులు కూల్చకుండా యథాతధంగా కాపాడాలని అందులో ఉందన్నారు. కానీ వాటిని బుట్టదాఖలు చేసేలా బండి సంజరు వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క పెట్రోల్, డీజిల్ చార్జీలపై కేంద్రం సేస్ కింద రకాల పనులతో రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కల్యాణలక్ష్మి ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రం రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసిందని, దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తతెత్తనున్నాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా.. 57 ఏండ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛను బకాయిలతో సహా చెల్లించాలని, రాజీవ్ గృహకల్ప కాలనీ ఇండ్ల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధుకు రూ.17వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నా.. ఎక్కడా అమలు కాలేదన్నారు. ఎన్నికలొస్తున్నాయని కాంగ్రెస్ పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తుందని, రైతుబంధు, రుణమాఫీ పెంచుతామంటుందన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందులోని లొసుగులను సవరిస్తే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య కార్యాచరణ కూటమి ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు కొమటి రవి, చింతల యాదయ్య, ఆశోక్, జె.చంద్రశేఖర్, వినోద తదితరులు పాల్గొన్నారు.
కురునెల్లి సలోమికి సన్మానం
కరాటే అంతర్జాతీయ పోటీల్లో నేపాల్‌లో జరిగిన అండర్ 14 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన కురునెల్లి సలోమిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శాలువా కప్పి సన్మానించారు.
ఎస్. వీరయ్య బొకేను అందించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె మరిన్ని పోటీల్లో పాల్గొనడానికి ఇబ్బందికరంగా ఉందని తెలియజేయగా.. అప్పటికప్పుడే రూ.50వేలు అందజేస్తామని, దానికి కేరళ కామ్రేడ్ ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా పార్టీలూ సలోమికి సహకరిస్తామనీ, ఆమె మరిన్ని పతకాలు సాధించి ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు కొనియాడారు.