Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారి దాటుతున్న జగన్నాథ్పల్లి వాసులు
నవతెలంగాణ-బిచ్కుంద
వేసవి నేపథ్యంలో గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. భగీరథ నల్లాల నీళ్లు వారం రోజులుగా రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నీళ్ల కోసం రోడ్లు దాటి పొలాలకు గట్లకు చేరి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాతీయరహదారి దాటుతున్నారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ జగనాథ్పల్లిలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. జగన్నాథ్ పల్లి గ్రామం 161 జాతీయ రహదారి పక్కనే ఉండటంతో రోడ్డుకు అవతలి పక్కన ఉన్న పొలాల్లో నుంచి నీటిని తెచ్చుకునేందుకు గ్రామస్తులు పాట్లు పడుతున్నారు. మహిళలు, యువకులు, పిట్లలు కలిసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని జాతీయ రహదారిని దాటుతున్నారు. రోజూ ఇలా రోడ్డు దాటి తాగునీరు తెస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. నీటి సమస్యలపై పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకునే వారే కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.