Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు ప్రముఖుల సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ ప్రజావైద్యురాలు డాక్టర్ శ్యామలాంబ (80) ఆదివారం ఉదయం అనారోగ్యంతో కనుమూశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ చిర్రావూరి లక్ష్మినర్సయ్య చిన్న కూతురు. . ఆమె భర్త బసవేశ్వర్ రావు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వారు అమెరికాలో ఉంటున్నారు. ఆమె స్వగృహం హైదరాబాద్‌లోని అబిడ్స్ లో ఉంటుంది.. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అజ్ఞాతంలో ఉన్న వారికి వైద్యసేవలందించేందుకు పంజాబ్ నుంచి వచ్చిన డాక్టర్ సత్యపాల్ తులి ఆమెను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సత్యపాల్ 1974లో చనిపోయారు. శ్యామలాంబ చిన్నపిల్లల వైద్యురాలిగా, నిలోఫర్ మాజీ సూపరిండెంట్‌గా సేవలందించారు. కుటుంబ నేపథ్యం, సత్యపాల్ పెంపకంలో ఆమె చివరి వరకు పేదలకు చికిత్సనందించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ.జీ.నర్సింహారావు తదితరులు ఆమె పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆమె పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ప్రజావైద్యురాలిని కోల్పోయాం...తమ్మినేని
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆమె తండ్రి చిర్రావూరి.లక్ష్మి నరసయ్య 30 సంవత్సరాలు ఖమ్మం మున్సిపల్ చైర్మెన్ గాసామాన్య ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు.తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న డా. శ్యామాలంబ వైద్య రంగంలో పేద కుటుంబాలకు, సీపీఎం, ప్రజా సంఘాలు నిర్వహించిన మెడికల్ క్యాంపులకు హాజరయి ఉచిత సేవలందించే వారని గుర్తు చేశారు. ఆమె మరణం ఒక ప్రజా వైద్యురాలు ను కోల్పోయినట్టయిందని అన్నారు.
ప్రముఖుల సంతాపం
శ్యామలాంబ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, పార్టీ ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, ఐద్వా సీనియర్ నాయకులు అల్లూరి మన్మోహిని, టి.జ్యోతి, బి.ఇందిర, శశికళ, బి.హైమావతి, ఆశాలత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సుగుణ, గోషామహల్ నియోజకవర్గ కన్వీనర్ పి. నాగేశ్వర్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.