Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల, మతాలే సమాజాభివృద్ధికి అడ్డుగోడలు
- అందుకే కుల, మత దురహంకార హత్యలపై అవి మాట్లాడట్లేదు :
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజాభివృద్ధికి కుల, మతాలే అడ్డుగోడలుగా ఉన్నాయనీ, రాజకీయ పార్టీలు కుల సంఘాలు ఓటు బ్యాంకుగా మారాయని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 'కుల దురంహకార హత్యలు-కూల్చివేయబడుతున్న రాజ్యాంగ విలువలు' అనే అంశంపై సమాలోచన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూపీ, బీహార్, తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఖాప్ పంచాయతీలు, సభలు అమలు చేసే పాశవిక తీర్పులు, హత్యలకు పురిగొల్పే చర్యలు దేశవ్యాప్తంగా విస్తరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశం ఎదుగుతున్న క్రమంలో పిల్లలు ప్రేమించుని పెండ్లి చేసుకుంటే వారిని చంపేయడం ఉన్మాద చర్యలు కాకపోతే ఏమవుతాయని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలకు కులసంఘాలు ఓటు బ్యాంకుగా మారాయనీ, అందుకే ఆయా పార్టీల నేతలు కుల, మత దురంహకార హత్యలను ఖండించకపోగా మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 3 శాతం మంది మతాంతర వివాహాలు, 13 శాతం మంది కులాంతర వివాహాలు చేసుకున్నారనీ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కులాల ఆధిపత్య ముసుగులో జరుగుతున్న హత్యలను నివారించేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ..కులం పోవాలంటే పునాది అంశాలైన ఎక్కువతక్కులు, అంతరాలు పోవాలన్నారు. దళితులు, అణగారిన వర్గాలు, పేదలు, ఆర్థిక పరిపుష్టత లేని వాళ్ల ఇండ్లలోనే ప్రేమ వివాహం చేసుకున్న వారి హత్యలు చోటుచేసుకుంటున్నాయనీ, కుల, మత దురంహకార హత్యల్లో ఆర్థిక కోణం కూడా దాగి ఉందని వివరించారు. క్యాపిటల్‌కు కులం ఒక పునాదిగా మారిందన్నారు. మనుధర్మాన్ని పెంచిపోషించే పెంచిపోషించే పార్టీ నేడు దేశాన్ని ఏలుతున్నదన్నారు. అందుకే రాజ్యాంగానికి, చట్టాలకు విలువలేకుండాపోయి మనుధర్మం ముందుకు వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కొనేందుకు చైతన్యవంతమైన రచనలు రావాలని ఆకాంక్షించారు. నవలా రచయిత్రి లక్ష్మీనాగేశ్వర్ మాట్లాడుతూ..సాంఘిక సమానత్వం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే పార్టీలు అధికారంలో ఉండటం వల్లనే దేశంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోగ్రెసివ్ మూవ్మెంట్ ఎప్పుడూ ముందుకే వెళ్తుందనీ, ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తే వారిని ప్రోత్సహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సహకరించాలని సూచించారు. సైకాలజిస్టు వీరేంద్ర మాట్లాడుతూ..భాగస్వామిని ఎంచుకోవడం సృష్టి ధర్మమన్నారు. పిల్లలకిష్టమైన వారిని పెండ్లీలు చేసుకోకుండా 98 శాతం మంది తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారనీ, ఇష్టంలేని పెండ్లీలు చేయడం కూడా హత్యలతో సమానమని చెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించే ప్రచారం విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ప్రేమ వివాహాలు, సెక్స్ ఎడ్యుకేషన్‌పై మీద పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్నా ఏమీ కాదనే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారలన్నారు. పిల్లలు కులాంతవివాహం చేసుకుంటే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలను భరించలేక తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు హత్యలకు పూనుకుంటున్నారని వివరించారు. సాహిత్య పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..తెలంగాణ సమాజంలో పురాత కాలం నుంచి కుల, మతాంతర వివాహాలు చేసుకున్న ప్రముఖుల పేర్లను ఉదహరించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వచ్చాక పిల్లలను చదువుల మిషన్‌గా మారుస్తారే తప్ప సామాజిక పరిజ్ఞానం గురించి అవగాహనే కల్పించట్లేదన్నారు. ఈ కార్యక్రమంలో గాజోజు నాగభూషణం, కోయి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.