Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి. విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేసే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మధ్యాహ్న భోజన పథకం వంట వారు, ఆశ ఇతర ముఖ్య కార్యకర్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి. విజయలక్ష్మి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని మగ్దూం భవన్లో తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ అసోసియేషన్, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ల సంయుక్తాధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యం, విద్యపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసే భారాన్ని కోటి మంది స్కీమ్ వర్కర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫ్రంట్లైన్ కార్మికులైన స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తూ చట్టపరంగా వారికీ రావాల్సిన హక్కులు, వేతనాలు, ఈ.పి.ఎఫ్, ఈఎస్ఐ తదితర సామాజిక భద్రతా సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని ఆమె విమర్శించారు.స్కీమ్ వర్కర్లకు నెలకు కనీస వేతనాలు రూ.21000, పెన్షన్ వెయ్చి రూపాయలు చెల్లించడం తోపాటు ఈ.పి.ఎఫ్, ఈఎస్ఐ, సామాజి భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేసారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేసవి సెలవులతో సహా పాఠశాలలు మూసివేసిన కాలానికి కనీస వేతనాలు చెల్లించాలనీ, తగినంత బడ్జెట్ కేటాయింపుతో శాశ్వత, మంచి నాణ్యతతో తగిన అదనపు రేషన్ అందించాలన్నారు. సమావేశానికి ప్రేమపావని, సాయి ఈశ్వరీ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజ్ తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి, తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. సుగుణ తదితరులు పాల్గొన్నారు.