Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30న బహిరంగ సభ
- 31, జూన్ ఒకటిన రాష్ట్ర క్లాసులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో నేటి నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర మూడవ మహాసభలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు పట్టణంలో ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఉదయం 11గంటలకు పట్టణంలోని జూనియర్ కాలేజీ నుంచి గాంధీపార్కు మీదుగా ఏఆర్ గార్డెన్‌కు ర్యాలీ చేరుకోనుంది. అనంతరం ప్రారంభసభ జరగనున్నది. దీనికి ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ కంచె అయిలయ్య, కవి, గాయకులు వరంగల్ శ్రీనివాస్ హాజరవుతున్నారు. మహాసభలకు 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ రాష్ట్ర మహాసభలో గొర్రెల కాపరుల సమస్యలతో పాటుగా గొర్రెల పంపిణీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కూడా చర్చించనున్నారు.
మన రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా గొర్రెలు, మేకల కాపరులు ఏ సీజన్లోనైనా కిలోమీటర్లు కాలినడకన గొర్ల మోత కోసం వెళ్తుంటారు. నెలల తరబడి అడవులు, గుట్టలు, మన్యం భూములు అంటూ ఏవి లెక్కలేకుండా తిరిగి జీవాలను కాపాడుకుంటారు. సమాజానికి ఎలాంటి కల్తీలేని మాంసాహారాన్ని అందించడంలో వారి కృషి వెలకట్టలేనిది. అయినా అలాంటి వాళ్లకు సమాజంలో దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదు. వారి పిల్లలకు విద్యా, ఉద్యోగరంగాల్లో కూడా న్యాయమైన వాట లభించడం లేదు.
ఉద్యమాల ఫలితంగా అనేక జీవోలు...
జీఎంపీఎస్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు చేపట్టారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య స్ఫూర్తిగా కడవెండి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనేక సార్లు కలెక్టరేట్ ముట్టడి, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించారు. గొల్ల కురుమలకు సకాలంలో మందులు అందించడం, పశువైద్యశాలల్లో డాక్టర్లు ఉండేలా చూడటం, గొర్రెల మేతకు ప్రభుత్వం హక్కు కల్పించడం, ముఖ్యంగా ప్రభుత్వ చెరువుల్లో తుమ్మలను కొట్టడానికి హక్కును సాధించింది. సంబంధిత జీవోలు తీసుకురావడంలో సంఘం కీలక పాత్ర పోషించింది.
రాష్ట్ర మహాసభ డిమాండ్లు ఇవే...
మొదటి విడత గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి తారాస్థాయికి చేరిందని, కొనుగోలు చేసిన గొర్రెలు మంద కాడికి తీసుకువచ్చే సమయానికి చనిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, అందుకు ప్రత్యామ్నాయంగా సబ్సిడీ గొర్రెల పథకాన్ని గొల్ల కురుమల అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తూ రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలనేది ప్రధాన డిమాండ్‌గా వినిపిస్తుంది. గొర్రెల పంపిణీ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వచ్చిన గొర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోగల పోవడంతో ఎక్కువగా మత్యువాత పడినట్లు వాటికి నష్టపరిహారం చెల్లించాలని, అందుకు గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించాలి. గొర్రెల మేకల పెంపకం దారుల ప్రతి గ్రామంలో సుమారు 50నుంచి 500మంది వరకు సభ్యులు ఉన్నారని, వారు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి సొసైటీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరనున్నారు. గతంలో తోడేళ్ల భయం ఉండేదని, ప్రస్తుతం వీధికుక్కల భయం ఎక్కువగా ఉందని గతంలో భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన సుమారు 80గొర్రెలు మత్యువాత పడ్డాయి.వీధి కుక్కల బెడద నివారించాలని కోరనున్నారు.గొర్రెలు మేత కోసం ప్రతి సొసైటీకి 20ఎకరాల భూమిని కేటాయించాలని కోరనున్నట్టు, ప్రభుత్వ భూముల లో నేర్చుకోవడానికి తుమ్మల కొట్టుకోవడానికి తీసుకువచ్చిన ప్రభుత్వ జీవోలు 559, 1016లను పకడ్బందీగా అమలుచేయాలి. గొర్రెల మేత కోసం నిత్యం పదుల సంఖ్యలో కిలోమీటర్లు తిరగాల్సి వస్తుందని 50 ఏండ్లకే కాళ్లు ఆరుగుతున్నాయని, 50 ఏండ్లకు వృద్ధాప్య పింఛన్ రూ.5వేలు ఇవ్వాలి.ప్రస్తుత మానవాళికి భవిష్యత్‌లో మాంసాహారం కొరత రాకుండా ఉంచేందుకు గొల్ల కురుమ యువతకు సబ్సిడీతో కూడిన 50లక్షల గొర్రెల ఫామ్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి.గొర్రెల కాపర్లు విధి నిర్వహణలో ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.గొర్రెలు, మేకల పెంపకం దారుల మాంసాన్ని విక్రయించడానికి ప్రతి జిల్లాకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
నగదు బదిలీ పథకం అమలు చేయాలి
గొర్రెలు, మేకల పెంపకం దారులకు గొర్రెల పంపిణీ పథకం ద్వారా సబ్సిడీపై నాసిరకం గొర్రెల పంపిణీ చేశారు. ప్రస్తుతం కాపరులకు నాణ్యమైన గొర్రెలను అందించేందుకు నేరుగా గొర్రెలకాపరులు అకౌంట్లోకి నగదు జమ చేయాలి. చదువుకున్న యువతకు గొర్రెల రోగాలపై శిక్షణ ఇచ్చి వారిని గోపాలమిత్రలుగా నియమించాలి. సబ్సిడీతో కూడిన గొర్రెలఫామ్ షెడ్ ఏర్పాటుకు గొర్రెల కాపరులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి.
జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్