Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోసం పోరాటం
- ఏపీ రైతు సంఘం మహాసభల్లో సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం సాధించేందాక సమరశీల ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 22వ రాష్ట్ర మహాసభల్లో ఆయన సౌహార్ధ సందేశమిచ్చారు. దేశంలో జాతీయోద్యమం తర్వాత మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం జరిగిందని గుర్తు చేశారు. ఫలితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకున్నదన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం సాధించడం, రైతాంగం ముందున్న ముఖ్యమైన కర్తవ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామంటూ నరేంద్రమోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలును విస్మరించిందన్నారు. దేశంలో ఉఏటా 10 నుంచి 13 వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నివారణకు కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటు శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. దీని వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంట నష్టపరిహారం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. ఐక్య పోరాటాల ద్వారానే రైతులు కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగల్గుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక మైత్రితో అన్ని తరగతుల ప్రజలను కలుపుకుని ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు.