Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్ల సింహగర్జనలో తీవ్ర ఉద్రిక్తత
- ఘట్కేసర్లో ఘటన
నవతెలంగాణ-ఘట్కేసర్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలోని మైసమ్మ గుట్ట సమీపంలో ఆదివారం జరిగిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో గందరగోళం నెలకొంది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పా లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో రెడ్ల జేఏసీ నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈక్రమంలో కొందరు రెడ్డిసంఘం నాయకులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రూ.5వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పదే పదే అడ్డుకోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కొందరు ఆయన కాన్వారుపై చెప్పులు, కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరారు. దాంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసుల సాయంతో మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.