Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంపుదలకు అడ్డూ అదుపు లేదా ?
- తగ్గించేవరకు ప్రజాపోరాటాలు కొనసాగుతాయి
- వామపక్ష పార్టీల నేతల హెచ్చరిక
- కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను తక్షణం తగ్గించాలి.. మోడీ పాలనలో ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.. ధరాభారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల, మత విద్వేషాలు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారు..'' అని వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ల ఎదుట వామపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడారు. మోడీకి స్వదేశీ సేవలు తక్కువై విదేశాలపై ప్రేమ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర ధరలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో కొద్దిపాటి వేతనాలతో బతికే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. ఈ ధరల పెరుగుదల అసంఘటితరంగ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ పెరుగుదల శ్రమ జీవులందరి సమస్యని, అందులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయని చెప్పారు. బంగారు బాతులాంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే బీజేపీ చేసే అభివృద్ధా అని ప్రశ్నించారు. వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దిగ్బంధిస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో కలిసి ధర్నాలో చెరుపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే, అడ్డుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యంగా కలిసి ఉంటున్న హిందూ, ముస్లింల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి రాజీవ్ గాంధీ చౌరస్తాలో ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఖమ్మం ధర్నాచౌక్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) జిల్లా నాయకులు ఎం.గిరి మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పెట్టుబడిదారులకే ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను వేగవంతం చేసిందని, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దోచి పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాల దుష్ప్రభావాలు ప్రజలమీద విపరీతంగా పడ్డాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హిందూత్వ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ రాజేశంకు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, విద్యుత్, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.