Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలితుల నుంచి పాలకులుగా ఎదగాలి
- సామాజిక తత్త్వవేత్త, ఫ్రొఫెసర్ కంచ ఐలయ్య
- ప్రారంభమైన జీఎంపీఎస్ రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ గొర్లు ఇచ్చే వరకు ఉద్యమాలు నిర్వహించి, ఆయనకు నిద్రపట్టకుండా చేయాలని సామాజిక తత్త్వవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా యాద్రాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవులకు గొర్లు ఇస్తామని చెప్పి, మోజార్టీ ప్రజలకు ఇవ్వకుండా నాన్చుతున్నారని విమర్శించారు. మూడు, నాలుగేండ్ల వరకు డీడీలు పెండింగ్లో పెట్టడం అన్యాయమన్నారు. యాదవులు గుప్తలు పట్టుకుని ప్రగతి భవన్కు వెళ్తే గొర్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రగతి భవన్ లక్ష్యంగా గొర్రెల కాపరులు ఉద్యమాలు చేపట్టాలన్నారు. అయితే, గొర్రెలు తీసుకుని పిల్లలను చదువుకు దూరం చేయొద్దని సూచించారు. గొర్రెలు ఇస్తున్న ప్రభుత్వం.. గ్రామాల్లో షేడ్, మేతకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అడవులు తిరిగి గొర్రెలను మేపుతూ.. కల్తీలేని మాంసం, పాలు, పెరుగు, నెయ్యి, మంచి పంటలు పండించేందుకు అవసరమైన ఎరువులు గొర్రెల కాపరులు అందిస్తుంటే వారికి సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తమ సామాజిక తరగతిలో విద్య లేకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. చదువుకుంటేనే సచివాలయం, యూనివర్సీటీల స్థాయికి చేరుకుంటామన్నారు. నిజాం పాలకులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకుని హక్కుల కోసం ఉద్యమించాలని చెప్పారు. పాలితుల నుంచి పాలకులుగా మారితేనే మన జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. ప్రతి యాదవ బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసం చేయాలన్నారు. ప్రతి ఊరిలోనూ ఆంగ్ల బోధన కోసం పాఠశాలలు ఏర్పాటు చేసేలా సంఘం నాయకత్వం పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. ఓట్లు అడుక్కుని అధికారంలోకి వచ్చేవాళ్లకు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. చదుకుంటేనే ప్రతి వ్యక్తిలోనూ భయం పొతుందన్నారు.
కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గొర్ల, కుర్మ బిడ్డలు విద్యావంతులు, రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన సామాజిక తత్త్వవేత్త కంచ ఐలయ్య లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని విద్యలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఐక్యతతో ఉంటేనే చట్టసభల్లోకి నాయకులుగా వెళతారని, అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో యాదాద్రి జిల్లాలో యాదవులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో యాదవుల ప్రతినిధిగా కేసీఆర్కు కుడిభుజంగా పనిచేశానని, తన శక్తిని పూర్తిగా తెలంగాణ ఏర్పాటుకోసం ఉపయోగించానని చెప్పారు. ఆర్థికంగా ఏ సమస్య లేకపోయినప్పటికీ విద్యలో మాత్రం చాలా వెనుకంజలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో పూర్తిగా మార్పు రావాలని కోరారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, మహాసభ గౌరవ అధ్యక్షులు కల్లూరి మల్లేషం, జిల్లా అధ్యక్ష, కార్యద్శులు దయ్యాల నర్సింహా, మద్దెపురం రాజు, యాదవ సంఘం నాయకులు బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.