Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ హెచ్చరిక
- సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి
- మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో పెద్దఎత్తున పోరాటం చేయకమందే సమస్యలు పరిష్కరిస్తే.. సంస్థ మనుగడకీ.. సింగరేణి యాజమాన్యానికి మేలు జరుగుతుందని కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ నాయకులు హెచ్చరిక చేశారు. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణలోని 11 ఏరియాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం సమర శంఖం పూరించారు. 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కొత్తగూడెం కదిలి వచ్చారు. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని వేలాది మంది కార్మికులు ముట్టడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిరవధికంగా ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని, ఫిబ్రవరి 9న సెంట్రల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఇచ్చిన హామీలను యాజమాన్యం అమలు జరపాలని డిమాండ్ చేశారు. సివిక్ కార్మికులను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు అప్పగిం చాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసం హరించుకోవాలని, చర్చల పేరుతో జాప్యం కాకుండా తక్షణమే వేతనాల పెంపుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాంకి, జనరల్ మేనేజర్ పర్సనల్ అందెల ఆనందరావుకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జరిగిన సభలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ ద్వారా కోట్లాది రూపాయల లాభాలను కంపెనీ పొందుతుందన్నారు. ఈ లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి లబ్ది చేకూరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం తమ ఇష్టారాజ్యంగా నిధులను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. 20 సంవత్సరాల నుంచి సింగరేణిలో అహర్నిశలు శ్రమిస్తున్న, కరోనా టైంలో సైతం ప్రాణాలకు తెగించి ముందుండి పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. 30 శాతం పపీఆర్సీ, జీవో నెంబర్ 22 ప్రకారం.. హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, చట్టబద్ధ సౌకర్యాలను, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేస్తున్న పని ఆధారంగా వేతనాలు చెల్లించా లన్నారు. ఈనెల 31వ తేదీన జరిగే చర్చల్లో మెరుగైన ఒప్పందానికి యాజమాన్యం సిద్ధపడాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు చేసే ఉద్యమాలకు, ఆందోళనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాష, టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ధర్నాలో పాల్గొని మద్దతు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, వాసిరెడ్డి సీతారామయ్య, కడారి సునీల్, బి. మధు, ఏజె.రమేష్, యర్రగాని కృష్ణయ్య, ఏ.వెంకన్న, నేమిళ్ల సంజీవ్, యాకుబ్ షావలి, డి. బ్రహ్మానందం, జె.సీతారామయ్య, యాదగిరి, సత్తయ్య, రవీందర్, సిహెచ్. త్యాగరాజన్, కాలం నాగభూషణం, ఎల్.విశ్వనాథం పాల్గొన్నారు.