Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమ అరెస్టులు ఆపాలి : టి సాగర్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారనీ, వాటిని పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. పౌల్ట్రీ రైతులను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాద్రావులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్టాండర్డ్ రియరింగ్ చార్జీలు కేజీకి కనీసం 12 నుంచి 15 రూపాయలు చెల్లించాలన్నారు. ఎఫ్్సీఆర్ రాని రైతులకు రియరింగ్ చార్జీలు కేజీకి ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. కోడి పిల్లలు వచ్చే తేదీని సదరు రైతుకి ఐదు రోజుల ముందుగా తెలియ జేయాలని అన్నారు. నాణ్యమైన కోడి పిల్లల్ని 70శాతం పుంజులు 30శాతం పెట్టలు విడివిడి బాక్సులలో పంపించాలని గుర్తు చేశారు. అలాగే ప్రతి కోడిపిల్లా కనీసం 45 గ్రాములు ఉండాలనీ, నాణ్యమైన దాణా ఇవ్వాలనీ, దాణా సంచులపై వాటిలో ఏది ఎంత శాతం కలుపుతున్నారో, వాటిని ముద్రించాలని కోరారు. మొదటి వారంలో వచ్చే మోరాలిటీని కంపెనీయే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్ని కోళ్లు లిఫ్టింగ్ చేస్తారో, ఆ రోజు లిఫ్టింగ్ రేట్ రైతుకు ముందే తెలియజేయాలన్నారు. అలాగే లిఫ్టింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి 12 గంటలలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఒక వేళరాత్రి 12 గంటలు దాటితే కోడికి ఒక రూపాయి అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఏడు గంటలకు లోడింగ్ మొదలు పెట్టకపోతే ఆ రోజు లిఫ్టింగ్ చేయొద్దని కోరారు. లిఫ్టింగ్ 40 నుంచి 45 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. లిఫ్టింగ్ అయిన తర్వాత మిగిలిన దాణా కంపెనీ వారే వేరే రైతుకు పంపించాలని కోరారు. రైతు ఏ తప్పు చేయకపోయినా కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టి వేదిస్తున్నాయని విమర్శించారు. ఈ వేదింపులు ఆపాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.