Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కక్షిదారులు ఇరువురూ రాజీపడుతూ లోక్‌అదాలత్‌లో ఒప్పందం (అవార్డు) చేసుకుంటే దానిని సమీక్షించే అధికారం కింది కోర్టులకు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. లోక్‌అదాలత్‌లో చేసుకున్న రాజీ ఒప్పందాలపై ఇరుపక్షాల్లో ఎవరైనా అభ్యంతరం ఉంటే వాటిని సమీక్షించే పరిమిత అధికారం హైకోర్టులకు రాజ్యాంగంలోని 226, 227 అధికరణాలు కల్పించాయని వివరించింది. భార్యభర్తల మధ్య 2006లో లోక్‌అదాలత్‌లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని వరంగల్ జిల్లా సివిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎ వెంకటేశ్వర్‌రెడ్డి ఇటీవల పైవిధంగా తీర్పు వెలువరించారు. భార్గవి నిర్మాణ సంస్థ కె ముత్యంరెడ్డి మధ్య జరిగిన కేసులో, పంజాబ్ వర్సెస్ జలౌర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం లోక్‌అదాలత్ ఇచ్చే అవార్డులపై జోక్యం చేసుకునే పరిధి హైకోర్టులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. హైకోర్టులకూ పరిమిత అధికారమే ఉంటుందన్నారు. వరంగల్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. లోక్‌అదాలత్‌లో జరిగిన రాజీ ఒప్పందం అమల్లోకి వస్తుందన్నారు. లోక్‌అదాలత్ అవార్డుపై అభ్యంతరం ఉంటే హైకోర్టులో సవాల్ చేసుకోవచ్చునని చెప్పారు.
భారీగా జడ్జీల బదిలీ
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు మొత్తం 52 మంది బదిలీ అయ్యారు. 43 మంది జిల్లా జడ్జీలు, తొమ్మిది మంది సీనియర్ సివిల్ జడ్జీలు ఈనెల 31వ తేదీలోపు విధుల్లో చేరాలని సూచించింది. ల్యాండ్ రిఫామ్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైన బి మంజరి వచ్చేనెల ఒకటో తేదీలోగా చేరేందుకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉండగా, వరంగల్ జిల్లా ములుగు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా చేస్తున్న నాదెండ్ల రామచంద్రరావు భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ కోర్టుకు బదిలీ అయ్యారు.