Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీంతోనే బిల్లులు రాక సర్పంచుల ఇక్కట్లు
- రూ.1100 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోవట్లేదు
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జయప్రదం చేయాలి : మంత్రులు టి.హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ ఉపాధి హామీ చట్టం కింద నయాపైసాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1100 కోట్ల ఉపాధి నిధులను ఇవ్వాలని మే మొదటి వారంలో కేంద్రానికి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. మరోసారి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలనీ, నిధులు విడుదల చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించా రు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ. 1,013 కోట్లు ఇవ్వలేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగానే పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, పారిశుధ్య పనులు చేసుకోవడంతోపాటు గ్రామానికో ట్రాక్టర్ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు పల్లెల అభివృద్ధి కోసం రూ. 8,963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 2,748 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 514.3 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. వివిధ దశల్లో చెల్లింపుల కోసం ఉన్న సుమారు రూ. 285 కోట్లను రాబోయే రెండు, మూడు రోజుల్లో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకం కింద ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తి చెల్లింపులు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ, సమగ్ర ప్రణాళికతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం మంచి ఫలితాలను రాబట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణ గ్రామాలేనన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌కవర్ 7.7 శాతం పెరిగిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.