Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53వ ఆవిర్భావ దినోత్సవంలో చుక్క రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) ఐక్య ఉద్యమాల వారధి, సారధి అని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సీఐటీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని ఆ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో అరుణపతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఓవైపు సరళీకరణ విధానాల అమలు తీవ్రతరమవుతున్నదనీ, మరోవైపు మతోన్మాదం పెచ్చిమీరి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కుట్రలకు పూనుకుంటున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తమ హక్కుల కోసం పోరాటాల్లోకి వచ్చేలా కార్మికులకు రాజకీయ చైతన్యం కల్పించాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. విశాల దృక్పథంతో ఐక్య ఉద్యమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేలా, దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా పోరాటాలు చేయాలన్నారు. లేదంటే కార్మికవర్గం మరింత వివక్షకు గురయ్యే, కట్టుబానిసలుగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ..కార్మిక వర్గ ఐక్యత కోసం సీఐటీయూ ఏర్పడిందన్నారు. మోడీ సర్కారు కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చిన నేపథ్యంలో అనేక సవాళ్ల మధ్య సీఐటీయూ మరింత చొరవ తీసుకుని ఐక్య ఉద్యమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ మాట్లాడుతూ.. సమాజంలో సగ భాగమున్న మహిళలను పోరాటాల్లో భాగస్వామ్యం చేయకపోతే కార్మిక వర్గపోరాట లక్ష్యం నెరవేరవేరదనే ఉద్దేశంతోనే సీఐటీయూ శ్రామిక మహిళా సమ న్వయ కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వర్గపోరాటాల్లో మహి ళ భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.కోటంరాజు, వీఎస్రావు, రాష్ట్ర నాయకులు రమేశ్, శ్రీకాంత్, సోమన్న, సునిత, తదితరులు పాల్గొన్నారు.