Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడిన 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు
నవతెలంగాణ-మియాపూర్
ఐటీ కంపెనీల్లో జాబులంటూ, లక్షల్లో జీతాలు ఇప్పిస్తామని చెప్పి బ్యాక్ డోర్ ఉద్యోగాల పేరిట మరోసారి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఓ ఐటీ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కోక్కరి వద్ద రూ.2లక్షల వరకు వసూలు చేసి నిండా ముంచింది ఇన్నో హబ్ టెక్నాలజీస్ సంస్థ. ఈ ఘటన రంగారెడ్డి మాదాపూర్లో సోమవారం వెలుగుజూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
మాదాపూర్లో ఇన్నో హబ్ టెక్నాలజీస్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రెండు నెలల పాటు శిక్షణ, జీతాలు ఇచ్చారు. ప్రముఖ కంపెనీల్లో బ్యాక్ డోర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో ఉద్యోగి వద్ద రూ.2లక్షల చొప్పున వసూలు చేశారు. కొన్నాళ్లుగా వర్క్ ఫ్రమ్ అంటూ ఆఫీసుకు ఎవరూ రావొద్దని చెప్పారు. దీంతో ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన అసైన్మెంట్ చేస్తూ ఇంటి వద్ద నుండే పని చేస్తున్నారు. అయితే, రెండు వారాల కిందట కంపెనీ వెబ్ సైట్, మెయిల్స్ బ్లాక్ అయినట్టు గుర్తించిన ఉద్యోగులు విషయం తెలుసుకునేందుకు మాదాపూర్లోని ఆఫీస్కు వచ్చారు. అక్కడ సంస్థకు సంబంధించి బోర్డు లేకపోవడంతో కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో మోసపోయినట్టు తెలుసుకున్న ఉద్యోగులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఇదే విషయంపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థపై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్యాక్ డోర్స్ జాబ్స్ అంటూ సంస్థ డబ్బులు వసూలు చేసిందన్నారు. బాధ్యులను త్వరలోనే పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాక్ డోర్స్ జాబ్స్ అని ఎవరు చెప్పినా నమ్మొద్దని సీఐ సూచించారు.