Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ హామీలన్నీ ఉల్లంఘనలే
- ధర్నాచౌక్నూ ఎత్తేస్తే కొట్టాడి సాధించుకున్నాం
- కార్మిక సంఘాలను చీల్చే కుట్ర
- 73 షెడ్యూల్ పరిశ్రమల వేతన జీవోలను తొక్కిపెట్టారు
- మంత్రి మల్లారెడ్డి, కార్మిక శాఖ ఉన్నా లేనట్టే
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన పాలడుగు భాస్కర్
'భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా హామీలివ్వడం.. ఉల్లఘించడం..కొత్త హామీలివ్వడం..మళ్లీ ఉల్లఘించడం సీఎం కేసీఆర్‌కు రివాజుగా మారింది. ఉద్యమ సమయంలోనూ, రాష్ట్ర మొచ్చాక కార్మికులకు చేస్తానని చెప్పినవేవీ చేయలేదు. అసలు సమస్యలేంటి? అనే దానిపై ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన పాపాన పోలేదు. పైగా, కార్మిక సంఘాలను చీల్చేసి కొందరు నేతలను దగ్గరకు తీసి భజన సంఘాలను పెట్టించుకున్నారు. ధర్నాచౌక్నూ ఎత్తేశారు. పారిశ్రామిక వేత్తల ఒత్తిడితో 73 షెడ్యూల్ పరిశ్రమల వేతన జీవోలను తొక్కిపెట్టారు. రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి, కార్మిక శాఖ ఉన్నా లేనట్టే. రాష్ట్ర సర్కారు ఒంటెద్దు పోకడలకు పోయే కొద్దీ.. బంతిని గోడకేసి కొట్టేకొద్దీ మరింత వేగంగా వచ్చే మాదిరిగా కార్మికలోకమూ అంతే ఉవ్వెత్తున పోరుబాట పడుతుంది. వాళ్లేం చేస్తారులే అని చులకన చూస్తున్న సర్కారుకు తగిన బుద్ధి కచ్చితంగా చెబుతారు' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ చెప్పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..
తెలంగాణ ఉద్యమానికి ముందు, ఆ తర్వాత కార్మిక వర్గానికి రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలేంటి?
కార్మిక వర్గం తమ రక్తాన్ని, చెమటను ధారబోస్తేనే తెలంగాణ ఆర్థికాభివృద్ధి ముందుకుసాగేది. అలాంటి కార్మికవర్గం పట్ల కేసీఆర్‌కు చిన్నచూపున్నది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కార్మికులు పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు చేస్తామని కూడా చెప్పారు. అందర్నీ పర్మినెంట్ చేస్తామన్నారు. శాసనసభలో, మండలిలో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తే కుంటి సాకులు చెప్పింది. కానీ, ఏవీ చేయలేదు.
స్వరాష్ట్రంలో కార్మికుల బతుకులు ఏమైనా బాగుపడ్డాయా?
కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా మారాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్న దుస్థితి. అంతకష్టపడితే ఎక్కువ శాతం మందికి వచ్చే వేతనం పదివేల రూపాయల లోపే. చాలా పరిశ్రమల్లో పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావట్లేదు. కార్మికశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కార్మిక చట్టాలు, శాఖ మీద మంత్రి మల్లారెడ్డికి కనీస అవగాహన లేదు. ఆయన ఉన్నా లేనట్టే. కార్మికులతోగానీ, కార్మిక సంఘాల నేతలతోగానీ సమస్యలు, డిమాండ్లపై సీఎం కేసీఆర్ చర్చించిన పాపాన పోలేదు. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు తెలంగాణ, ఆంధ్రా, దేశ విదేశాల పారిశ్రామికవేత్తలతో మీటింగ్లమీద మీటింగ్‌లు పెడుతున్నది. కార్పొరేట్ల మీద ఒలకబోస్తున్న ప్రేమలో అర ఔన్స్ కూడా కార్మికులపై చూపట్లేదు. కార్మికుల నిజవేతనాలు పడిపోయాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో కార్మికులు బతుకుబండి లాగటం కష్టంగా మారింది.
73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతనాల సవరణ ఎంతవరకు వచ్చింది?
కేవలం నాలుగు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతనాలు పెంచుతూ గెజిట్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తల ఒత్తిడితో జీవోలు విడుదల చేయలేదు. 12 ఏండ్లుగా వేతన సవరణలు లేవు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతనాలు పెంచకపోవడానికి ఆంధ్రాపాలకులే కారణమని దుమ్మెత్తిపోసిన కేసీఆర్..గత విధానాలనే అవలంబిస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం అష్టకష్టాలు పడే కార్మికులకు వేతనాలు పెంచేందుకు మనసొప్పలేదుగానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు మాత్రం లక్షలకు లక్షలు పెంచారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్‌ను అటకెక్కించింది. మల్టీపర్పస్ పేరుతో జీపీ, మున్సిపల్ కార్మికులనూ ఇబ్బందిపెడుతున్నది. పీఆర్సీ కమిషన్ చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేసింది. ప్రయివేటు, ట్రాన్స్పోర్ట్ కార్మికులపై చలాన్ల రూపంలో భారాలు మోపుతున్నది. స్కీం వర్కర్లతో బండెడు చాకిరీ చేయిస్తున్నది తప్ప సమస్యలు పరిష్కరించట్లేదు. బీడీ కార్మికుల వేతన జీవోను తొక్కిపెట్టింది. ఈ రంగాలే కాదు..చెప్పుకుంటూ పోతే కార్మికులు సమస్యలు చాతాడంత ఉన్నాయి.
కార్మిక సంఘాల మీద రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంది?
కార్మికుల హక్కుల కోసం సంఘాలు ధర్నాలు, సమ్మెలు చేయొద్దని అనధికార నిషేధం విధించింది. ఆర్టీసీలో సంఘాలే ఉండొద్దంటున్నది. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా తీసేసింది. ప్రశ్నించే, హక్కులను అడిగే వారిపై ఇలా చేయడం ప్రభుత్వానికి తగదు. తాత్కాలికంగా ప్రభుత్వానిది పైచేయి కావొచ్చుగానీ తర్వాతి కాలంలో అంతకు అంత అనుభవించక తప్పదు. కార్మిక సంఘాల నేతలను దద్దమ్మలు, దౌర్భాజీలు అని తిట్టిపోయడం సీఎం స్థాయి వ్యక్తికి తగదు. కార్మికుల పక్షాన పోరాడే సీఐటీయూని రాష్ట్ర సర్కారు టార్గెట్ చేసింది. అధికార బలంతో కొన్ని సంఘాల నేతలను ప్రలోభపెట్టి భజన సంఘాలుగా మార్పుకున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. భజన సంఘాల అంతిమంగా నష్టపోయేది కార్మికులే. ఈ విషయాన్ని గుర్తించిన కార్మికులు తమ సమస్యలపై పోరాడే సీఐటీయూ వైపు వస్తున్నారు.
కార్మికుల సమస్యలపై సీఐటీయూ చేసిన పోరాటాలేంటి? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నాయి.
సీఐటీయూ స్వతంత్ర కార్యాచరణతోపాటు ఐక్య ఉద్యమాలతో ముందుకు వెళ్తున్నది. ఐక్యంగా ఉంటేనే విజయం సాధించడం సులువు.ఇందిపార్కు వద్దనున్న ధర్నాచౌక్‌ను ఎత్తేసి సర్కారు దుర్మార్గంగా వ్యహరించబోతే ఐక్య పోరాటాల ద్వారా విజయం సాధించాం. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీల కోసం కార్మికవర్గాన్ని ఐక్యం చేసి పోరాడుతాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర సర్కారు పక్కదోవ పట్టించింది. అవి భవన నిర్మాణ కార్మికులకే దక్కేలా పోరాడుతాం. కాంట్రా క్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఇలా ఒక్క టేంటి అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి పోరాడుతాం. రాష్ట్రంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కార్మికగర్జన పాదయాత్ర ద్వారా కండ్లార చూశాం. వారి రక్షణ, మెరుగైన వేత నాల కోసం పోరాటాలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తాం.