Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని ఛేదించిన చెర్లపల్లివాసి
- బీర్పూర్ మండలం చెర్లపల్లిలో సంబరాలు
నవతెలంగాణ - సారంగాపూర్
సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 374ర్యాంకు సాధించి ఇటు కన్నవారి పేరు అటు ఉన్న ఊరు పేరు పతాక శీర్షికలో నిలిపాడు చెర్లపల్లి వాసి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ గుగ్లావతు శరత్ నాయక్ సివిల్స్ రాసిన మొదటి ప్రయత్నంలోనే 374 ర్యాంకు సాధించారు.
చర్లపల్లి గ్రామానికి చెందిన గుగ్లావత్ శరత్ తండ్రి భాషా నాయక్ రైతు కాగా, తల్లి యుమున మినీ అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. శరత్‌కు తమ్ముడు,సోదరి ఉన్నారు. ముగ్గురు సరస్వతి పుత్రులే..తమ్ముడు పవన్ నాయక్ నాగ్‌పూర్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చేస్తుండగా, సోదరి దివ్యకు బీడీఎస్ సీటు వచ్చినా కాదని ఎంబీబీఎస్‌కు సన్నద్ధమౌతోంది.వారిది నిరుపేద కుటుంబం అయినప్పటికీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
ఇంటికి పెద్దవాడైన శరత్ స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించగా నీట్ ఫలితాల్లో ఒక్క మార్కు తేడాతో ఎంబిబీబీఎస్ సీటు చేజారింది. బీడీఎస్‌లో సీటు వచ్చినప్పటికీ దాన్ని కాదని జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో చేరి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. దీంతో సంతృప్తి చెందని శరత్ ఐఏఎస్ కావాలని పట్టుదలతో ఇద్దరు మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఓ గదిని అద్దెకు తీసుకొని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని ఛేదించి అనుకున్నది సాధించాడు.
కలెక్టర్ ఫిదా..
ఇరవై రోజుల కిందట జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి శరత్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెబుతూ అభినందనలు అందుకున్నాడు. శరత్ పెర్ఫార్మెన్స్కు ఫిదా అయిన కలెక్టర్ సివిల్స్‌కు సంబంధించి మరిన్ని సూచనలు చేశారు.