Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 నుంచి పాఠశాలల పున :ప్రారంభం
- విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్/న్యూఢిల్లీ
వచ్చేనెల మూడు నుంచి 30వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)తో బడిబాట కార్యక్రమంపై సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం వటి చర్యలు చేపట్టేందుకు బడిబాట కార్యక్రమాన్ని వచ్చేనెల మూడు నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల మూడు నుంచి పదో తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చేనెల 13న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని వివరించారు. బడుల్లో పండుగ వాతావరణం నెలకొల్పాలని సూచించారు. అదేరోజు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించి వారిలో భరోసా కల్పించాలని కోరారు. బడిబాటలో భాగంగా ప్రజాప్రతినిధులనూ ఆహ్వానించి సీఎం కేసీఆర్ ప్రారంభించిన 'మన ఊరు-మనబడి' కార్యక్రమంతోపాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయాన్ని వివరించాలని సూచించారు. వచ్చేనెల 14 నుంచి 30 వరకు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు.
'మన ఊరు-మనబడి'తో మారనున్న బడుల రూపురేఖలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు -మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్, కాన్వెంట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భారీ సంఖ్యలో చేరే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య గతంలో సాధించిన ప్రగతిని వివరించి విద్యార్థులను ఆకట్టుకోవాలని సూచించారు. ప్రతి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగన్వాడీ ఉపాధ్యాయులతో తరచూ మాట్లాడాలనీ, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులను సర్కారు బడుల్లో చేర్పించేలా కృషి చేయాలని కోరారు. వారి పాఠశాలల్లో చదువు పూర్తయిన వారిని పై తరగతులకు పంపడానికి ఏర్పాట్లు కొత్త వారిని చేర్పించడానికి స్వాగత ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో నూతన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక రోజు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని కోరారు. ప్రజలు, సర్పంచుల నుంచి మంత్రుల వరకు, స్వచ్చంధ సంస్థలు, వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశింంచారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.