Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన వేసవి శిక్షణా శిబిరం
- ప్రదర్శనలతో ఆకట్టుకున్న చిన్నారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ జవహర్ బాలభవన్‌లో వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శినీ ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో చిన్నారులు నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. భరతనాట్యంలో 'అడుగులు నుంచి అదిగో కొలువై ఉన్నాడు' వరకు నాలుగు అంశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. జానపద నృత్యం, దాండియా పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. వీటితో పాటు యోగాసనాలు, పిరమిడ్ తదితర అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
సందేశాత్మక బాబా స్కిట్
మూఢ నమ్మకాలను నమ్మొద్దు ...సైన్సునే నమ్మాలంటూ ప్రదర్శించిన బాబా స్కిట్ మంచి సందేశాన్నిచ్చింది. భర్త అనారోగ్యం, దూరాన ఉన్న పిల్లలను తెచ్చుకునేందుకు సరిపడిన డబ్బు లేక దిగులుతో ఉన్న జానకిని దొంగ బాబా మహిమలతో సమస్యలు తీరుస్తానని డబ్బులు లాగుతాడు. ఆమె స్నేహితురాలు సరిత దొంగ బాబా గుట్టును రట్టు చేయటం సైన్సునే నమ్మాలంటూ సందేశం ఇవ్వటం ఆలోచిపంజేసేలా ఉన్నది. దొంగ బాబా తన అనుచరుల ద్వారా ఇతరుల సమస్యలు తెలుసుకుని తనకు మహిమల ద్వారా తెలిసిందని ఎలా నమ్మబలుకుతాడో కండ్లకు కట్టినట్టు చూపించారు. మోసపోయిన జానకి పాత్రలో కొత్తూరు నిశ్చలదాస్, ఆమెతో పాటు ఇతరులు మోసపోకుండా దొంగబాబా గుట్టును బట్టబయలు చేసే పాత్రలో కొత్తూరు స్వేచ్ఛాదాస్తో పాటు పలువురు చిన్నారులు ఆయా పాత్రల్లో జీవించారు.
ఆకట్టుకున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్
చిన్నారులు వేసిన పెయింటింగ్స్‌తో శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ప్రకతి, భూమి, వాతావరణం తదితర అంశాలను ఎంచుకున్న చిన్నారులు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. పలువురు ఆహుతులు ఎగ్జిబిషన్ తిలకించి చిన్నారులను మెచ్చుకున్నారు.
తల్లిదండ్రులు పట్టించుకుంటే....పిల్లలంతా ఉత్తములే
తల్లిదండ్రులు శ్రద్ధ కనబరిచిన పిల్లలంతా ఉత్తములుగా, ఉన్నతులుగా ఎదుగుతారని డిప్యూటీ కలెక్టర్ అమరేందర్ తెలిపారు. వేసవి శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా జవహర్ బాలభవన్ ఉషారాణితో కలిసి ఆయన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం చదువుతోనే కాకుండా ఇతర సృజనాత్మక కళల ద్వారా పిల్లలో మానసిక వికాసం పరిఢవిల్లుతుందని తెలిపారు. జవహర్ బాల భవన్‌కు పంపించి పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు.
సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
వేసవి శిక్షణా శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన వారికి జవహర్ బాలభవన్ డైరెక్టర్ ఉషారాణి ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు దగ్గరుండి తోడ్పాటునందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సిబ్బంది రాంచందర్, ఉపాధ్యాయులు కిషన్, వసంత్ రావు, లైబ్రరియన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.