Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరలపెంపుతో బడుగుల బతుకులు ఆగం
- కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్..
- దేశాన్ని కొల్లగొడుతున్న బీజేపీ : వామపక్షాల ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో లజ్జారహితంగా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, దేశ ప్రజలపై భారాలు మోపిందని వక్తలు విమర్శించారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని మహాధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
కార్పొరేట్లకు ఊడిగం...
కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రధాని దేశానికి దొరకడం మన దౌర్భాగ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. దేశాన్నేలిన ఎనిమిదిమంది ప్రధానులు చేసిన అప్పుకంటే..ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పులు ఎక్కువనీ, ఆ రకంగా అందరికంటే ఆయన ముందున్నాడని ఎద్దేవా చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక 23 పబ్లిక్ రంగ సంస్థలను అమ్మేశారని తెలిపారు. దేశ ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును లూటీ చేసిన 29మంది మోసగాండ్లకు మోడీ సర్కార్ బాసటగా నిలుస్తున్నదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి దగుల్బాజీ ప్రధాని ఉన్నాడని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్లాంటి సంస్థలను ప్రయివేట్ వారికి కట్టబెట్టే హక్కు వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
బాదుడే...తగ్గేదేలే..
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రెండేండ్లుగా కూరగాయల ధరలు పెరుగుడే కానీ..తగ్గుడు లేదని తెలిపారు. వంటనూనెల నుంచి మొదలు అన్నింటి ధరలు మధ్యతరగతి, సామాన్య ప్రజలు అందుకోని రీతిలో నిత్యావసర ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్,బొగ్గు ధరలు పెరిగాయి కాబట్టి నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పటం వరకు పరిమితమవుతున్నారని చెప్పారు. చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించాల్సిన అవసరముందన్నారు. దీనికి మోడీ వందిమాగదులు చేప్పే సమాధానం సత్యదూరంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగింది. కాబట్టి వీటి ధరలు పెరుగుతున్నాయని ఇప్పటిదాక చెప్పుకుంటూ వచ్చారన్నారు. ఇప్పుడు మరో రకమైన వాదన తెస్తున్నారన్నారు. ఉక్రెయిన్ యుద్దం వల్ల ధరలు పెరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మెడకాయమీద తలకాయ ఉన్నోడు ఎవరు కూడా నమ్మని విధంగా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా..భారత దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏం చెప్పినా చెల్లుబాటవుతుందని మోడీ ప్రభుత్వం భావించటం వల్లనే పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. భారాలు ప్రజలపై మోపి..లాభాలు మాత్రం కార్పొరేట్లకు కట్టబెట్టడం న్యాయమా?అని అడిగారు. అందుకే దీన్ని దగుల్బాజీ ప్రభుత్వంగా పరిగణించాలని తెలిపారు. లజ్జారహితంగా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి, బడాబాబుల సేవలో కేంద్ర సర్కార్ తరిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని బీజేపీ కోసం దోచి పెడుతున్నదని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతిని మోడీ ప్రభుత్వం చట్టబద్దం చేసిందని విమర్శించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం అంతం కాదు..ఆరంభం మాత్రమేనని చెప్పారు.
బారానా పెంచి..చారానా తగ్గించి...
మోడీ సర్కార్ ప్రజలకు ఎంతో సేవచేసానంటూ ఎచ్చులకు పోతున్నదనిసీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రంగయ్య అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను బారానా పెంచి చారానా తగ్గించి దేశానికి ఏదో మేలు చేశామని చెప్పటం కపటత్వమని చెప్పారు.సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో పెట్టుబడి దారుల ప్రయోజనాలకోసమే మోడీ సర్కారు పనిచేస్తున్నదని చెపారు. పేదలు మరింత పేదలవుతుంటే..సంపన్నులు మరింత సంపదపోగేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జి ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై ధరల భారాలు పెరుగుతున్నాయని చెప్పారు.
మరో పక్క వేతనాలు పడిపోతున్నాయని తెలిపారు. ఎస్యుసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ విధానాలు అర్థం కాకుండా ఉండేందుకే దేశంలో కుల, మత దురభిమానాలను పెంచుతున్నారని విమర్శించారు.ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్, ఆర్ఎస్పీ నాయకులు ప్రసాద్, రాజేశ్, జానకి రాములు మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేశ్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంధా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కె.రమ, సీపీఐ(ఎంఎల్) ఎన్డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె గోవర్దన్, ఎన్డీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న ఇతర వామపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.